● ఇప్పటికే నిందితుడి రిమాండ్ ● ఇతరుల ప్రమేయంపైనా ఆరా ● ఎల్లారెడ్డిపేటలో కలకలం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మీసేవ కేంద్రంలో పోలీసులు శనివారం విచారణ చేపట్టారు. మీసేవ కేంద్రంలో పనిచేసే యువతిపై అనుచితంగా ప్రవర్తించిన నిర్వాహకుడు శ్రీనివాస్‌ను శుక్రవారం రిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఎల్లారెడ్డిపేట సీఐ ఓదెల వెంకటేశ్, ఎస్సై రమేశ్‌గౌడ్ ఆధ్వర్యంలో పోలీస్‌సిబ్బంది శనివారం క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా మండల కేంద్రంలోని మీసేవ కేంద్రంలో క్షుణ్ణంగా పరిశీలించారు. కంప్యూటర్లు, ఇతర రికార్డులను పరిశీలించారు. కేంద్రంలోని సీసీ పుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. సీఐ వెంకటేశ్ మాట్లాడుతూ కేంద్రంలో క్షుణ్ణంగా పరిశీలించి, పలు సాక్ష్యాలు సేకరించినట్లు తెలిపారు. యువతిని వేదించిన విషయంలో ఇతరుల ప్రమేయం ఉందన్న కోణంలో ఆరా తీస్తున్నామన్నారు. అలాగే కేంద్రం యజమానిని పిలిపించి పలు వివరాలు ఆరా తీశామని తెలిపారు.


