● అన్నదాతలను వెంటాడుతున్న ఎరువుల కష్టాలు ● జిల్లా రైతులకు ఇతర జిల్లాల్లో బుకింగ్ ● రూ.300 బస్తాను తెచ్చేందుకు రూ.300 ఆటో కిరాయి ● రైతులకు ఆర్థిక ఇబ్బందులు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అన్నదాతలను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. గతంలో ఊరిలోకే వచ్చిన ఎరువులు.. ఇప్పుడు యాప్‌లో బుక్ చేసుకునే విధానం రావడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్లు లేకపోవడం.. తెలిసిన వారి దగ్గరికి పోయి బుక్ చేయించుకుంటే ఇతర జిల్లాల్లో బుక్ అవుతుండడం సమస్యగా మారింది. రూ.300 బస్తాను దూర ప్రాంతం నుంచి తెచ్చుకునేందుకు ఆటో కిరాయికి రూ.300 పెట్టాల్సి వస్తుండడంతో అన్నదాతలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. రైతుల యూరియా కష్టాలపై ఫోకస్ కథనం.
ఎల్లారెడ్డిపేట మండలం నారాయణ పూర్‌కు చెందిన ఓ రైతుకు బోయినపల్లి మండలంలో ఒక్క బస్తా యూరియా బుక్ అయ్యింది. అంతదూరం వెళ్లి ఒక్క బస్తా తెచ్చుకోలేక క్యాన్సిల్ చేసుకున్నాడు.
గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన ఓర్సు రాజమల్లు అనే రైతు వారం రోజుల క్రితం యాప్‌లో యూరియా బుక్ చేసుకోగా ఇల్లంతకుంట మండలంలో దొరికింది. యూరియా బస్తా ఒక్కంటికి రూ.300 కాగా.. నాలుగు బస్తాలను అక్కడి నుంచి ఆటోలో తెచ్చేందుకు రూ.2వేలు కిరాయి చెల్లించాల్సి వచ్చింది. బస్తా ధర కంటే రవాణా చార్జీ డబుల్ అయ్యిందని సదరు రైతు వాపోయాడు.


