51 విచారణలో బయటపడ్డ అక్రమాల లొసుగులు ఏడాదిన్నర క్రితమే విచారణ పూర్తి నోటీసులిచ్చి చేతులు దులుపుకున్న అధికారులు రూ.1.68 కోట్లు పక్కదారి పట్టాయని తేటతెల్లం ఆడిట్‌లో సీఈవోకు సహకరించిన అధికారులపై చర్యలేవి ?
చందుర్తి(వేములవాడ): దోచుకున్నోనికి దోచుకున్నంత అనే మాటలు చందుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘానికి చక్కగా సరిపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.2లక్షల్లోపు రుణాలు మాఫీ చేయడంతో సంఘంలో జరిగిన అక్రమాలు వెలుగుచూశాయి. దీంతో సహకార సంఘం అధికారులు 2024, ఆగస్టులో 51 విచారణ చేపట్టారు. అక్రమార్కులను గుర్తించేందుకు విచారణ అధికారులకు ఏడాది పట్టింది. ఈ విచారణలో సీఈవో గంగారెడ్డి రూ.1.03కోట్లు సొంతానికి వాడుకున్నట్లు గుర్తించగా, మిగతా రూ.65లక్షలు దీర్ఘకాలిక, స్వల్పకాలిక వ్యక్తిగత రుణాలు అందించారు. ఆ రుణాలను 2008 నుంచి రికవరీ చేయలేదు. ఇంత అవినీతి జరిగినా సహకార సంఘంలో ఏటా జరిగిన ఆడిట్‌లో తప్పుడు నివేదికలను ఇచ్చిన ఆడిట్ అధికారులపై చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యమేమిటని సహకార సంఘం సభ్యులు ప్రశ్నిస్తున్నారు. పక్కదారి పట్టించిన సొమ్మును బహిర్గతం చేసిన, రికార్డులను ఆడిట్ చేసిన రికార్డులో ఆడిట్ అధికారులు వివరాలు గోప్యంగా ఉంచడంతో విచారణ అధికారులను తప్పు పడుతున్నారు.
రికార్డులు పరిశీలనలతో వెలుగులోకి..
సహకార సంఘంలో జరిగిన లావాదేవీలకు సంబంధించిన పుస్తకాలు, రికార్డులను, ఖాతాలను పరిశీలించిన సలు వ్యత్యాసాలను 51 విచారణలో గుర్తించారు. నిధుల వినియోగం, బకాయిల వసూళ్లు, ఖాతాల నిర్వహణ అంశాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు విచారణలో ప్రస్తావించినట్లు సమాచారం.
రూ.1.68 కోట్ల వ్యవహారంపై చర్చ సంఘానికి సంబంధించిన సుమారు రూ.1.68 కోట్ల వరకు విచారణలో బహిర్గతం చేసి ఏడాదిన్నర కాలం గడిచినా రికవరీ చేయలేదు. నోటీసులతో సరిపెట్టారు. ఇంత భారీ మొత్తానికి సంబంధించిన వ్యవహరంలో సీఈవో గంగారెడ్డి రెండేళ్ల క్రితం సస్పేన్షన్ అయ్యారు. నిధుల దుర్వినియోగానికి సహకరించిన అధికారులను ఎందుకు కాపాడుతున్నారంటూ సంఘం సభ్యులు, రైతుల్లో ప్రశ్నలు
వ్యక్తమవుతున్నాయి.
పాలకవర్గ బాధ్యులపై రికవరీ ఏదీ ?
సంఘం పరిధిలోని సభ్యులకు వ్యక్తిగత, దీర్ఘకాలిక రుణాల వసూళ్లల్లో బాధ్యులైన పాలకవర్గ సభ్యులకు రూ.65లక్షల రికవరీకి నోటీసులు ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు వాటి రికవరీ కోసం ఎలాంటి ఒత్తిళ్లు చేయలేదు. 2008 నుంచి రుణాలు ఉన్నాయని ప్రస్తుతం ఉన్న పాలకవర్గం సభ్యులే కాకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న సభ్యులు బాధ్యత వహించాలని సహకార సంఘం ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలు కాగితాలకే పరిమితమయ్యాయి.
సంఘ సభ్యుల సమక్షంలో
వివరాలు వెల్లడించాలి
చందుర్తి సహకార సంఘం పరిధిలోని సభ్యుల సమక్షంలో సహకార సంఘం ఉన్నతాధికారుల సభ్యుల సమక్షంలో అవినీతి, అక్రమాలు వెల్లడించాలి. ఇప్పటి వరకు చేపట్టిన చర్యలు, వసూలు చేసిన సొమ్ము వివరాలు, మిగిలిన సొమ్ము రికవరీకి ఎలా చేస్తారో బహిరంగంగా వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా సంఘంలో అవినీతి అక్రమాలు జరిగిన సంవత్సరాల్లో ఆడిట్ చేసిన అధికారుపై, రైతులు ప్రమేయం లేకుండా ఎలాంటి విచారణ లేకుండా రెండుసార్లు రుణాలను మంజూరి చేసిన బ్యాంకు సిబ్బంది ఎవరెవరూ అన్న వివరాలను ఉన్నతాధికారులు వివరించి , ఇక ముందు ఇలాంటి అవినతీ , అక్రమాలు జరగకుండా చర్యలు చేపట్టాలని సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
లీగల్ చర్యలకు సిద్ధమవుతున్నాం
చందుర్తి సహకార సంఘంలో 51 విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులైన వారిపై లీగల్‌గా చర్యలు చేపట్టేందుకు నివేదికలను సిద్ధం చేసుకుంటున్నాం. సంఘంలో అవినీతి, అక్రమాలకు బాధ్యులైన ఏ ఒక్కరిని వదిలిపెట్టబోం. దాదాపు 15 ఏళ్ల రికార్డులు, ఖాతాలు పరిశీలించి.. పక్కదారి పట్టిన సొమ్మును ప్రకటించాం. సంఘం పరిధిలోని సభ్యులు ఎవరూ అనుమానాలు పడొద్దు. సహకార చట్టం ద్వారా చర్యలు తప్పవు.
– రామకృష్ణ, జిల్లా సహకార సంఘం అధికారి, రాజన్న సిరిసిల్ల


