సిరిసిల్ల: ఎల్‌నినో తీవ్ర ప్రభావం ఉందని.. వరి వద్దు.. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని అధికారులు సూచించారు. అయితే జిల్లా రైతులు కాలానికి అనుగుణంగా విస్తారంగా వరి, పత్తి సాగుచేశారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 1,46,118 ఎకరాల్లో వరి పంట వేయగా.. 50,275 ఎకరాల్లో పత్తి సాగుచేశారు. 4,500 ఎకరాల్లో మొక్కజొన్న వేశారు. జిల్లాలో ప్రస్తుతం 2,10,380 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. వరి ఏపుగా ఎదుగుతుండగా పత్తిలో మాత్రం కలుపు సమస్య ఎక్కువగా ఉంది. కోనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగు జలాశయం నిండడంతో ఈ ప్రాంత రైతులు వరి సాగుచేశారు. వట్టిమల్ల, నిమ్మపల్లి, బావుసాయిపేట, కొండాపూర్ గ్రామాల్లో పసిడి పంటలు కనుచూపు మేర పచ్చదనంతో అలరిస్తున్నాయి. ఎగసిపడుతున్న బోర్లు, పైకొచ్చిన భూగర్భ జలాలతో మూలవాగు పరిసరాల్లో ముచ్చటైన వరిసాగు ఆవిష్కృతమైంది.


