జిల్లాకు చేరిన క్లాత్
కుట్టే పనులు ప్రారంభం
10 కళాశాలల్లో 2,500 మందికి లబ్ధి
గంభీరావుపేట(సిరిసిల్ల): ఇన్నాళ్లు పాఠశాలల స్థాయి విద్యార్థులకే పరిమితమైన యూనిఫామ్ కాలేజీ విద్యార్థులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని విద్యార్థులకు యూనిఫామ్ అందించేందుకు చర్యలు చేపట్టింది.
కొలతలు తీసుకుంటున్న
మహిళా సంఘాల సభ్యులు
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని విద్యార్థులకు యూనిఫామ్ అందించేందుకు మహిళా సంఘాల సభ్యులు రంగంలోకి దిగారు. విద్యార్థుల కొలతలు తీసుకుంటూ, వాటికి అనుగుణంగా యూనిఫామ్స్ కుట్టే పనులు మొదలుపెట్టారు. దీంతో మహిళా సంఘాల సభ్యులకు ఉపాధి అవకాశాలు లభించడంతోపాటు విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్స్ అందే అవకాశం ఏర్పడింది.
10 కళాశాలలు.. 2,500 మంది విద్యార్థులు
జిల్లాలో 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సుమారు 2,500 మంది ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ యూనిఫామ్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు పాఠశాల స్థాయిలోనే యూనిఫామ్స్ ఉండగా, తొలిసారిగా ఇంటర్ విద్యార్థులకు అందిస్తున్నారు.
తేడా కనిపించకుండా ఉండాలనే..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు అందరూ ఒకే రకమైన దుస్తుల్లో వస్తున్నారు. అదే కాలేజీలకు వచ్చేసరికి యూనిఫాం లేకపోయేసరికి ఒక్కో విద్యార్థి ఒక్కో రంగు దుస్తులతో వస్తున్నారు. దీంతో విద్యార్థుల మధ్య తారతమ్యాలు పొడచూపుతున్నాయి. ఈ భావనలను నివారించేందుకు ప్రభుత్వం యూనిఫాం పంపిణీకి శ్రీకారం చుట్టింది. యూనిఫామ్ అమలుతో విద్యార్థుల మధ్య ఆర్థిక స్థాయి, దుస్తుల విషయంలో తేడాలు కనిపించకుండా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. అందరూ ఒకే విధమైన దుస్తుల్లో కళాశాలకు రావడం ద్వారా సమానత్వ భావన పెంపొందడంతోపాటు క్రమశిక్షణ పెరుగుతుందని
చెబుతున్నారు.
ఎంఈవోల పర్యవేక్షణ
యూనిఫామ్ కొలతలు, క్లాత్ పంపిణీ, కుట్టు పనులు తదితర ప్రక్రియలను ఎంఈవోల పర్యవేక్షణలో కొనసాగిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా యూనిఫామ్స్ సిద్ధం చేసి, నిర్ణీత సమయంలో అందించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. నీలిరంగు చొక్కా, బ్లూ కలర్ ప్యాంట్‌తో యూనిఫామ్స్ ఇస్తున్నారు.


