గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట, లింగన్నపేట మధ్య మానేరువాగుపై మళ్లీ తాత్కాలిక మట్టి రోడ్డు ఏర్పాటు చేశారు. ‘వాగొచ్చె.. రోడ్డు పాయే’ శీర్షికన సాక్షిలో శనివారం ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. ప్రస్తుతం ద్విచక్రవాహనాలు, లైట్‌వెహికిల్స్ వెళ్లేలా తాత్కాలికంగా మట్టి రోడ్డును పునరుద్ధరించారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు, హెవీ వెహికిల్స్ మినహా మిగతా వాహనాల రాకపోకలు సాగుతున్నాయి.
అధ్యాపకులకు సన్మానం
సిరిసిల్ల అర్బన్: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న పలువురు ఉత్తమ అధ్యాపకులకు తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్(టీజీవో) ఆధ్వర్యంలో శనివా రం సన్మానించారు. జిల్లా ఇంటర్ విద్య కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా ఇంటర్ విద్యాధికారి శరత్‌కుమార్ చేతుల మీదుగా 10 మంది అధ్యాపకులకు అవార్డులు ప్రదానం చేశారు. టీజీవో అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ జబీ, సంఘం నాయకులు బొల్గం సాగర్, రసూల్, అహ్మద్ పాల్గొన్నారు.
సర్కారు బడికి పూర్వ విద్యార్థి కానుక
సిరిసిల్లటౌన్: విద్యాబుద్ధులు నేర్చుకున్న విద్యాలయానికి పూర్వ విద్యార్థి బోర్‌వెల్, మోటార్ అందించారు. సిరిసిల్లకు చెందిన ఎన్‌ఆర్‌ఐ డాక్టర్ కుసుమ విఠల్, ఆయన కుమారుడు కుసుమ శరత్ సిరిసిల్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు బోర్‌వెల్, మోటార్ అందించారు. శనివారం స్థానిక కౌన్సిలర్ గెంట్యాల శ్యామల చేతుల మీదుగా ప్రారంభించారు. కుసుమ రామయ్య జ్ఞాపకార్థం రూ.1.50లక్షలతో బోర్ ఏర్పాటు చేశారు. డాక్టర్ కుసుమ శరత్, పాఠశాల హెచ్‌ఎం బైరి రవీందర్, రిటైర్డ్ ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం మ్యాన ఆంజనేయులు, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ విజయ రఘునందన్, గాజుల ప్రతాప్ పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలి
సిరిసిల్లటౌన్: మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీపీఐ పట్టణ కార్యదర్శి పంతం రవి కోరారు. ఈమేరకు కార్మికుల సమస్యలను వివరిస్తూ సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఎం.ఎ.ఖదీర్‌పాషాకు వినతిపత్రం అందించారు. కొన్ని వార్డుల్లో 15 రోజులకోసారి డ్రైనేజీ శుభ్రం చేయడం లేదన్నారు. ఇప్పటికైనా కొత్త పాలకవర్గం మున్సిపల్ సిబ్బందిని పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గుంటి వేణు, సోమ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఖాళీ బిందెలతో నిరసన
గంభీరావుపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్‌లో తాగునీటి సమస్య తీర్చండి అంటూ కొందరు మహిళలు శనివా రం ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ కొన్ని వీధుల్లో నల్లా కనెక్షన్లు బ్లాక్ అయ్యాయని, మిషన్ భగీరథ నీళ్లు మురి కిగా వస్తున్నాయన్నారు. పంచాయతీ పరిధి లోని బోర్లు మరమ్మతులకు నోచుకోవడం లేదన్నారు. నీటి కోసం చేనుల వద్దకు వెళ్లే పరిస్థితులు వచ్చాయన్నారు.
ఆరు మండలాల్లో చిరుజల్లులు
సిరిసిల్ల: జిల్లాలోని ఆరు మండలాల్లో శనివారం చిరుజల్లులు కురిశాయి. కోనరావుపేటలో 7.3 మిల్లీమీటర్లు, వీర్నపల్లిలో 2.8, ఇల్లంతకుంటలో 1.0, తంగళ్లపల్లిలో 0.8, గంభీరావుపేటలో 0.5, వేములవాడలో 0.9 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.


