తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో పరిశీలించాలి
కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: జిల్లాలో భూముల రీసర్వే పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్‌లో బుధవారం అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్‌తో కలిసి రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే సర్వే చేసిన గ్రామాలకు సంబంధించిన భూరికార్డులు ఆయా మండలాల తహసీల్దార్లకు అందించాలన్నారు. సర్వే చేసే ముందు జీపీవోలు, ఏఈవోలు, పంచాయతీ కార్యదర్శుల ద్వారా ఏయే సర్వే నంబర్ భూముల సమాచారం ముందుగా ఆయా గ్రామాల్లో చేరవేయాలని ఆదేశించారు. తహ సీల్దార్లు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. ప్రభుత్వ భూముల వివరాలను సంబంధిత శాఖల అధికారులకు అందజేయాలన్నారు. గంభీరావుపేట మండలం శ్రీనివాసపురం, కోనరావుపేట మండలం లచ్చపేట, వేములవాడ మండలం చంద్రగిరి, చందుర్తి మండలం అనంతపల్లి గ్రామాల్లో సర్వే పూర్తయిందని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఆర్డీవోలు శ్రీధర్‌బాబు, కేఎస్‌బీ కుమారి, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
నోటీసుల జారీకి ఏర్పాట్లు
ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) కింద జిల్లాలో 5,008 నో మ్యాపింగ్ ఓటర్లు, 78,833 అనామలీస్ ఓటర్లకు నోటీసులు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆర్డీవోలు తమ పరిధిలోని బీఎల్వోలకు నోటీసులు జారీ, తదితర అంశాలపై శిక్షణ ఇవ్వాలన్నారు. కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రవీణ్, ఎలక్షన్ సెక్షన్ అధికారి రెహమాన్ పాల్గొన్నారు.


