నేతల చూపు!
మున్సిపాలిటీలు.. ఓటర్ల వివరాలు
కలిసొస్తే పోటీకి సై
పట్టణాల్లో ఆశావహుల ఎన్ని‘కలలు’
మున్సి‘పల్స్’పై పార్టీల నజర్
సిరిసిల్లలో 39, వేములవాడలో 28 వార్డులు
రిజర్వేషన్ల
వైపు..
సిరిసిల్ల: మున్సిపాలిటీల్లో వార్డులు, చైర్మన్ పదవుల రిజర్వేషన్లపై నేతలు దృష్టి సారించారు. రిజర్వేషన్ కలిసొస్తే పోటీలో దిగేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాను అధికారులు వెల్లడించారు. మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించడంతో త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనే అంచనాలతో ఆశావహులు ఉన్నారు. 2025 జనవరితో మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం ముగిసిపోగా.. ప్రత్యేకాధికారుల పాలన సాగుతోంది. ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నద్ధమవుతున్న తరుణంలో మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానాలు, వార్డుల రిజర్వేషన్లు చర్చనీయాంశమైంది.
మహిళా ఓటర్లే అధికం
సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో మహిళ ఓటర్లు అధికంగా ఉన్నారు. సిరిసిల్ల పట్టణ పరిధిలో 2,069 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉండగా.. వేములవాడలో 1,699 మంది ఎక్కువగా ఉన్నారు. వార్డుల వారీగా పరిశీలించినా మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది. గెలుపోటములు నిర్ణయించే శక్తి మహిళా ఓటర్లపైనే ఉంది.
మున్సిపల్ చైర్‌పర్సన్ సీటుపై గురి
సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానాలను ఏ సామాజిక వర్గాలకు రిజర్వు చేస్తారనే చర్చ సాగుతోంది. రాష్ట్ర స్థాయిలో మున్సిపాలిటీల సంఖ్య ఆధారంగా ఓటర్ల సంఖ్య ఆధారంగా మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానాలకు రిజర్వేషన్ కల్పిస్తారు. 2020 జనవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల చైర్‌పర్సన్ స్థానాలను బీసీ మహిళలకు కేటాయించారు. అప్పుడు జిందం కళాచక్రపాణి, రామతీర్థపు మాధవి పాలన పగ్గాలు చేపట్టారు. ఈసారి కలిసొస్తే వార్డు కౌన్సిలర్‌గా గెలిచి చైర్మన్/చైర్‌పర్సన్ సీటుపై కూర్చోవాలని పలువురు దృష్టి సారించారు. ఈమేరకు పార్టీల మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారు. సిరిసిల్లలో రెండు దశాబ్దాలుగా మహిళలకు కేటాయిస్తుండగా, వేములవాడలో కాస్త భిన్నమైన రిజర్వేషన్లు వచ్చాయి. వార్డుల రిజర్వేషన్లపై కూడా ఉత్కంఠ నెలకొంది.
మున్సి‘పల్స్’పై పార్టీ నజర్
● మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఓటర్ల నాడి పట్టేందుకు సిద్ధమవుతున్నాయి. సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు ఇప్పటికే స్థానిక బీఆర్‌ఎస్ నాయకులతో సమావేశం నిర్వహించారు. వార్డుల వారీగా పోటీదారులపై ఆరా తీశారు. మెజార్టీ స్థానాలు సాధించి గులాబీజెండా సిరిసిల్ల మున్సిపాలిటీపై ఎగురవేయాలని సూచించారు.
● కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లోని బీజేపీ ముఖ్యమైన నాయకులతో సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో బాగా పనిచేస్తే కాషాయం జెండా ఎగరడం ఖాయమనే స్పష్టం చేశారు.
● వేములవాడలో ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పార్టీ శ్రేణులతో సమావేశమై.. మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని భావిస్తున్నారు. సిరిసిల్లలోనూ మెజార్టీ స్థానాలను దక్కించుకోవాలని వ్యూహం రూపొందిస్తున్నారు. గెలిచే సత్తా ఉన్న అభ్యర్థులకే పార్టీ టిక్కెట్ ఇస్తుందని, పార్టీపరంగా సర్వే చేసిన తర్వాతే టిక్కెట్ల పంపిణీ ఉంటుందని ఆయా పార్టీలు స్పష్టం చేస్తున్నాయి. పార్టీ సహితంగా బీ–ఫామ్‌లతో జరిగే మున్సిపల్ ఎన్నికలు ఆయా రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి.
2020లో సర్‘కారు’ జోరు
సిరిసిల్లలో 22 స్థానాల్లో, వేమువాడలో 16 స్థానాల్లో బీఆర్‌ఎస్ విజయం సాధించి చైర్‌పర్సన్ స్థానాలను దక్కించుకుంది. అధికార బీఆర్‌ఎస్ రెబల్ అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా విజయం సాధించారు. ఎన్నికల తరువాత 9 మంది బీఆర్‌ఎస్ తిరుగుబాటు అభ్యర్థులు, మరో ముగ్గురు ఇండిపెండెట్లు అధికార బీఆర్‌ఎస్‌లో చేరడంతో మున్సిపాలిటీలో కౌన్సిలర్ల బలం 34కు చేరింది. సిరిసిల్లలో ముగ్గురు బీజేపీ, ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. వేములవాడలో 16 స్థానాలను బీఆర్‌ఎస్ దక్కించుకుంది. ఆరు స్థానాల్లో బీజేపీ, ఒక్క స్థానంలో కాంగ్రెస్, ఐదు స్థానాల్లో ఇండిపెండెంట్లు విజయం సాధించారు. ఇలా 2020 నాటి మున్సిపాల్ ఎన్నికల్లో అప్పటి అధికార బీఆర్‌ఎస్ పార్టీ సత్తాచాటుకుంది.
మున్సిపల్ వార్డులు ఓటర్లు మహిళలు పురుషులు థర్డ్ జెండర్
సిరిసిల్ల 39 81,959 42,011 39,942 06
వేములవాడ 28 40,877 21,279 19,580 18


