నెలరోజుల్లో 280 ఇళ్లు ప్రారంభించాలి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: జిల్లాలోని ఎంపీడీవోలు నిత్యం పది ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై సమీక్షించారు. ముగ్గు పోసినవారితో ఇంటి నిర్మాణ పనులు మొదలు పెట్టించాలని, ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. లబ్ధిదారులకు ఇటుక, ఇతర సామగ్రి అందుబాటులో ఉండేలా, సరైన ధరకు వచ్చేలా హౌసింగ్ అధికారులతో సమన్వయం చేసుకొని ముందుకెళ్లాలన్నారు. లబ్ధిదారుల నుంచి ఇంటి నిర్మాణ పనుల అడ్వాన్స్ తీసుకొని వెళ్లిపోయిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. బోయినపల్లి మండలంలో 23, తంగళ్లపల్లి మండలంలో 14 ఇళ్లు పూర్తి చేసిన ఎంపీడీవోలు, హౌసింగ్ అధికారులను అభినందించారు. నెలరోజుల్లో జిల్లాలో 280 ఇళ్ల ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శంకర్, మండల ప్రత్యేక అధికారులు గీత, అఫ్జల్‌బేగం, లక్ష్మీరాజం, రవీందర్‌రెడ్డి, హనుమంతు, షరీఫోద్దీన్, రామకృష్ణ, క్రాంతి, నజీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
సర్వే పరికరాలతో కచ్చితమైన భూకొలతలు
అధునాతన పెన్‌టెక్స్ రోవర్స్ సర్వే పరికరాలతో ఇళ్ల స్థలాల కచ్చితమైన కొలతల వివరాలు అందుబాటులోకి వస్తాయని కలెక్టర్ గరీమా అగ్రవాల్ వెల్లడించారు. సర్వే అండ్ సెటిల్మెంట్ శాఖ హైదరాబాద్ నుంచి కేటాయించిన మూడు పెన్‌టెక్స్ రోవర్స్ సర్వే పరికరాలు జిల్లాకు చేరుకున్నాయి. మంగళవారం వాటి పనితీరును కలెక్టర్, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, భూ సర్వే ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్క ఇంటి సరిహద్దులు, ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు, ఇతర ఖాళీ స్థలాల విస్తీర్ణం వివరాలు ఈ పరికరం ద్వారా సర్వే చేస్తారని, ఆ వివరాలు శాటిలైట్‌లో నమోదు చేయడంతో కచ్చితమైన సమాచారం అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. పరికరాలపై జిల్లాలోని ఇద్దరు డిప్యూటీ సర్వే ఇన్‌స్పెక్టర్లు వెంకటాచారి, వెంకటరత్నం, ఐదుగురు సర్వేయర్లు, డిప్యూటీ సర్వేయర్లకు కంపెనీ బాధ్యులు మూర్తి శిక్షణ ఇచ్చారు. కలెక్టరేట్ ఏవో రాంరెడ్డి, అధికారులు, సిబ్బంది ఉన్నారు.


