● ఆర్‌ఎంపీల ఇష్టారాజ్యం ● అర్హతకు మించి వైద్యం ● అవగాహన
అక్రమాలపై ఫిర్యాదు చేయండి..
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి జిల్లాలో కొందరు శంకర్‌దాదా ఆర్‌ఎంపీలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అర్హత ఉండదు.. అనుమతులు ఉండవు. అయినా వైద్య చికిత్సలు చేసేస్తుంటారు. అడిగే వారు లేకపోవడం, తనిఖీలు చేసేవారు ఆ విషయమే మరచిపోవడంతో ఇదే అదునుగా ఇష్టారాజ్యంగా క్లినిక్స్ ఏర్పాటు చేస్తున్నారు. గత్యంతరం లేక స్థానికంగా అందుబాటులో ఉందనే ఉద్దేశంతో తమ వద్దకు వస్తున్న రోగులకు చుక్కలు చూపుతున్నారు. రోగుల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్‌ల వద్దనే ల్యాబ్, ఫార్మసీ ఏర్పాటు చేసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల పలు చోట్ల ఆర్‌ఎంపీలు చేసిన వైద్యం వికటించి కొందరి ప్రాణాల మీదకు వచ్చిన ఘటనలు చోటుచేసుకున్నాయి. చిన్నారులు, బాలింతలు ఇబ్బంది పడిన ఉదంతాలూ వెలుగుచూశాయి. దీనికితోడు సమీప పట్టణాల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల వారితో ఆర్‌ఎంపీలు కుమ్మకై ్క రోగులను అక్కడికి పంపిస్తూ అడ్డగోలుగా ‘కమీషన్’ రూపంలో సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సరైన అర్హతలు, నిబంధనలు లేకుండా యాంటీ బయాటిక్స్ డ్రగ్స్ విక్రయించడం, సరఫరా చేయడం చట్టవిరుద్ధం. డగ్స్ అండ్ కాస్మొటిక్ యాక్ట్ 1940 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. లైసెన్స్ కలిగిన ప్రతీ డ్రగ్ డీలర్, హోల్‌సేల్ వ్యాపారులు తమ మందుల సరఫరాలో పారదర్శకత పాటించాలి. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) నిబంధనల ప్రకారం మందులు నిల్వ ఉంచాలి. ఎవరుపడితే వారు నిల్వ చేస్తే కఠిన చర్యలకు అర్హులవుతారు
– షానవాజ్ ఖాసీం, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) డైరెక్టర్ జనరల్


