రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
● ప్రమాద బాధితులను కాపాడితే రూ.25వేలు పురస్కారం ● హెల్మెట్ లేకుంటే పెట్రోల్ పోయొద్దు : కలెక్టర్ గరీమా అగ్రవాల్ ● నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : ఎస్పీ మహే శ్ బీ గీతే
తంగళ్లపల్లి(సిరిసిల్ల): రహదారిపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ భద్రత నియమాలు పాటించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా మండలంలోని మండెపల్లి ఐటీడీఆర్‌లో గురువారం రవాణాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఎస్పీ మహేశ్ బీ గీతేతో కలిసి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో గతేడాది 268 ప్రమాదాలు జరిగాయని తెలిపారు. డ్రైవర్లు తమ కుటుంబ బాధ్యతను గుర్తించి వాహనం నడపాలని సూచించారు. ప్రమాదాల నివారణకు ‘నో హెల్మెట్ – నో పెట్రోల్’ నిబంధనను అమలు చేస్తామని స్పష్టం చేశారు. సెల్‌ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేయడం ప్రాణాంతకమని హెచ్చరించారు. రోడ్డు ప్రమాద బాధితులను సకాలంలో ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన వారికి ప్రభుత్వం ‘రహవీర్ గుడ్ సామరిటన్’ పథకం కింద రూ.25వేలు ఆర్థిక సాయం అందిస్తుందని తెలిపారు. బాధితులకు రూ.1.50 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తున్నట్లు వివరించారు. ఎస్పీ మహేశ్ బీ గీతే మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గత ఏడాదితో పోలిస్తే జిల్లాలో ప్రమాదాలు 40 శాతం తగ్గాయని, దీనిని సున్నాకు తీసుకురావడమే లక్ష్యమని తెలిపారు. అనంతరం తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్(టైడ్స్) కేంద్రాన్ని అధికారులు పరిశీలించారు. జిల్లా రవాణా అధికారి లక్ష్మణ్, ఆర్టీఏ సభ్యుడు సంగీతం శ్రీనాథ్, ఆర్ అండ్ బీ ఈఈ నరసింహాచారి పాల్గొన్నారు.


