మాంజా.. ప్రమాదాల పంజా
ప్రాణాలమీదికొస్తున్న సరదా
ప్రమాదకరంగా చైనా మాంజా
విక్రయించొద్దంటున్న అధికారులు
సంక్రాంతి వేళ మూడు శాఖల నిఘా
కేసులు.. ట్రేడ్ లైసెన్స్ రద్దు : మున్సిపల్ కమిషనర్
సిరిసిల్ల: సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఏ గల్లీలో చూసినా పిల్లలు పతంగులు(గాలిపటాలు) ఎగురవేస్తూ కనిపిస్తుంటారు. గాలిపటాలు ఎగురవేస్తూ సంతోషంగా గడపడం వరకే బాగానే ఉన్నా.. వాటికి చైనా మాంజా(దారం) కట్టడమే ప్రమాదాలకు కారణమవుతుంది. ఈ మాంజాకు తాకిన పక్షులు చనిపోతుండగా మనుషుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. ఒకప్పటి మాదిరిగా నూలుపోగులతో చేసిన దారాన్ని వినియోగించాలని జిల్లా అధికారులు కోరుతున్నారు. పండుగను సరదాగా జరుపుకోవాలే కానీ ప్రమాదాలకు కారణంగా నిలువు వద్దని సూచిస్తున్నారు.
నిషేధం విధించిన రాష్ట్ర ప్రభుత్వం
ముప్పును గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం 2017 జూలై 11న చైనా మాంజా విక్రయాలపై నిషేధం విధించింది. పర్యావరణ పరిరక్షణ చట్టం 1966 ప్రకారం చైనా మాంజాను అమ్మినా.. కొనుగోలు చేసినా.. వినియోగించినా నేరం. ఈ మాంజా అమ్మితే ఏడేళ్ల జైలు, రూ.10వేలు జరిమానా విధిస్తారు.
మూడు శాఖల తనిఖీలు
జిల్లా వ్యాప్తంగా చైనా మాంజాల కోసం మూడు ప్రభుత్వ శాఖలు వేర్వేరుగా తనిఖీలు చేస్తున్నాయి. పోలీసులు నిఘా బృందాలను రంగంలోకి దింపి చైనా మాంజాల అన్వేషణలో ఉన్నాయి. మరోవైపు అటవీ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో దుకాణాలలో తనిఖీలు చేస్తున్నారు. చైనామాంజా విక్రయించొద్దని అవగాహన కల్పిస్తున్నారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ అధికారులు మరో అడుగు ముందుకేసి చైనా మాంజా విక్రయిస్తే దుకాణాల ట్రేడ్ లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు. పిల్లల తల్లిదండ్రులు సైతం చైనా మాంజాను పిల్లలు వినియోగించకుండా చూడాల్సిన బాధ్యత ఉందని అధికారులు అంటున్నారు.
పొంచి ఉన్న ప్రమాదం
సంక్రాంతి సీజన్‌లో పిల్లలు, పెద్దలు గాలిపటాలను ఎగురవేస్తూ ఎంజాయ్ చేస్తారు. నూలుపోగులను వినియోగిస్తే గట్టిగా ఉండదని, ప్లాస్టిక్, గాజు పొడి, ఇతర రసాయనాలతో తయారు చేసిన చైనా మాంజా(దారం) వినియోగిస్తున్నారు. అయితే ఆ దారం తెగిపోయి విద్యుత్ తీగలను, చెట్లను తట్టుకుని వేలాడుతూ ఉంటుంది. అటుగా వెళ్లిన పక్షులు, కోతులు, కొండెంగలు, ఇతర జంతువులు మాంజాకు చిక్కుకుని గాయపడుతున్నాయి. మరోవైపు బైక్‌పై వెళ్లే వారికి సైతం ఆ మాంజా వైరు తాకి గాయపరుస్తున్నాయి.


