ఎరువుల కొరత లేదు
నిల్వ పరిశీలనకు టాస్క్‌ఫోర్స్ బృందాలు
పంపిణీలో ఇబ్బందులు రావద్దు
కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతే
సిరిసిల్ల: జిల్లాలో ఎరువుల కొరత లేదని.. నిల్వలు, పంపిణీని పరిశీలించేందుకు మండల, జిల్లా స్థాయిల్లో టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ గరీమా అగ్రవాల్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో ఎస్పీ మహేశ్ బీ గీతేతో కలిసి మండలాల అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 1,87,000 ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయన్నారు. 21 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని, ఇప్పటికే 13 వేల మెట్రిక్ టన్నుల విక్రయాలు పూర్తయ్యాయన్నారు. ఇంకా రెండు వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. యూరియా ఇబ్బందులు రాకుండా అపెరల్ పార్కులో నిల్వ చేసినట్లు తెలిపారు. పీఏసీఎస్‌ల వద్ద రైతుల కోసం షామియానా ఏర్పాటు చేయాలని, తాగునీటి వసతి కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
టాస్క్‌ఫోర్స్ తనిఖీలు
ఎరువుల పంపిణీ, నిల్వల పరిశీలనకు జిల్లా స్థాయిలో కలెక్టర్, ఎస్పీ, అదనపు కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా సహకార అధికారి, డీఆర్‌డీవో, మార్క్‌ఫెడ్ డీఎంలతో కూడిన టాస్క్‌ఫోర్స్ బృందం, మండల స్థాయిలో టాస్క్‌ఫోర్స్ టీమ్‌లో తహసీల్దార్, ఎస్‌హెచ్‌వో, మండల వ్యవసాయ అధికారి బృందం పని చేస్తుందని తెలిపారు. మండల స్థాయి టాస్క్‌ఫోర్స్ బృందం నిత్యం రెండు షాపులను తనిఖీ చేయాలని సూచించారు. స్టాక్ నిల్వలో తేడాలు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఎరువులను ఇతర అవసరాలకు వాడకుండా పర్యవేక్షించాలని టాస్క్‌ఫోర్స్ బృందాలకు ఎస్పీ మహేష్ బీ గీతే సూచించారు. నకిలీ ఎరువుల విక్రయాలపై దృష్టి సారించాలన్నారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, డీఆర్డీవో గీత, జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగం, జిల్లా సహకార అధికారి రామకృష్ణ పాల్గొన్నారు.
నెలాఖరులోగా వంద ఇళ్లు పూర్తి చేయించండి
సిరిసిల్ల పట్టణంలో ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ పరిశీలించారు. నెలాఖరులోగా వంది ఇళ్లను పూర్తి చేయించి గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని సూచించారు. సిరిసిల్లలో 808 ఇళ్లు మంజూరు చేయగా.. 554 ఇళ్లకు ముగ్గుపోశారని, 461 ఇళ్లు బేస్‌మెంట్ స్థాయిలో, 326 ఇళ్లు గోడల వరకు, 250 స్లాబ్‌లెవల్‌లో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. హౌసింగ్ పీడీ శంకర్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్‌పాషా ఉన్నారు.


