మారలే.. తొలగలే..
● అవే వార్డులు.. తొలగని తప్పులు ● ఓటరు జాబితాపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు ● అధికారుల తీరుపై విమర్శలు
సిరిసిల్లటౌన్: బల్దియా ఎన్నికల్లో మొదటి అడుగు తడబడింది. తప్పులు లేని ఓటరు జాబితా అందించడంలో అధికారుల నిర్లక్ష్యం తేటతెల్లమవుతోంది. ఎన్నికల సమయంలోనే హడావిడి చేస్తూ ఓటరు జాబితాను తయారు చేస్తూ మమా అనిపించడం పరిపాటైంది. గత ఎన్నికల్లో దొర్లిన తప్పులను సవరించకుండానే ఓటరు జాబితాను వెల్లడించడం సిరిసిల్లలో విమర్శలకు తావిస్తోంది.
మారని వార్డుల పరిధులు
జిల్లా కేంద్రమైన సిరిసిల్ల మున్సిపాలిటీలో 39 వార్డులున్నాయి. మొత్తంగా 81,959 ఓటర్లు ఉండగా పురుగులు 39,942, మహిళలు 42,011, ఇతరులు ఆరుగురు ఉన్నారు. 2020లో ఖరారు చేసిన వార్డులనే తిరిగి వార్డుల పరిధిలుగా గుర్తించి హద్దులు ఏర్పాటు చేశారు. గత ఎన్నికలకు ముందు సిరిసిల్ల మున్సిపల్‌లో విలీనమైన పెద్దూరు, సర్దాపూర్, రాజీవ్‌నగర్, చంద్రంపేట, రగుడు, చిన్నబోనాల, పెద్దబోనాల కలుపుకుని ఏర్పడిన 39 వార్డులను అలాగే ఉంచారు.
ఓటరు జాబితాపై ఫిర్యాదులు
సిరిసిల్ల మున్సిపల్ ఓటరు జాబితాలో దొర్లిన తప్పులపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈనెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులు, ఇతర అభ్యంతరాలను తెలపడానికి గడువు విధించారు. ఇప్పటి వరకు 13 ఫిర్యాదులు అందాయి. వాటిలో ఎక్కువగా చనిపోయిన వారి ఓట్లు తొలగించాలని, ఇతర వార్డులో ఉన్న తమ ఓటును సొంత వార్డుకు మార్చాలని కోరారు. అధికారులకు వచ్చిన ఫిర్యాదుల్లో ముఖ్యంగా 13వ వార్డులో పి.కార్తికేయ తన ఓటు పోలింగ్‌స్టేషన్ మార్చాలని, సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ తమ వార్డులో ఓటరులిస్టును ఇంటి నంబర్లు ప్రకారం క్రమపద్ధతిలో అందించాలని పేర్కొన్నారు. మొత్తంగా 13 ఫిర్యాదుల్లో తమ పరిధిలో పరిష్కరించే వాటిపై బల్దియా అధికారులు ఫోకస్ చేశారు. మిగతా ఫిర్యాదులను ఆర్డీవోకు నివేదిస్తున్నారు.


