ఇంటి నుంచి ఇస్రోకు..!
సైంటిస్ట్‌గా ఎదిగిన ‘అ’సామాన్యుడు
అనేక ఒడిదొడుకులు అధిగమించి లక్ష్య సాధన గంభీరావుపేట యువకుడు సాయిచరణ్ ఘనత
సుస్థిర పర్యావరణ పర్యవేక్షణే లక్ష్యం
సక్సెస్ స్టోరీ
గంభీరావుపేట(సిరిసిల్ల): వారిది సామాన్య కుటుంబం.. కుటుంబ పెద్ద ఆర్టీసీ ఉద్యోగి. ఆయన భార్య గృహిణి. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా.. అనారోగ్య సమస్యలు వెంటాడినప్పటికీ ఆ దంపతులు మా త్రం తమ కుమారుడికి మంచి చదువు చెప్పించారు. సమస్యలన్నింటినీ చదివిన వారి కుమారుడు బాగా చదువుకున్నాడు. పరిస్థితులకు అనుగుణంగా తన అడుగులు వేశాడు. చిన్నప్పటి నుంచి గణితం, భౌతిక శాస్త్రంపై మక్కువ పెంచుకున్న ఆ యన.. ఇస్రో ఆధ్వర్యంలో గతేడాది సెప్టెంబర్‌లో నిర్వహించిన పరీక్షకు హాజరయ్యాడు. ఇటీవల వె లువడిన ఫలితాల్లో సైంటిస్ట్ (జియో ఇన్ఫర్మేటిక్స్) గా ఎంపికయ్యాడు. డిసెంబర్‌లో నిర్వహించిన ఇంటర్వ్యూలో వందకు 65.92 మార్కులు సాధించాడు.
సామాన్య కుటుంబం..
గంభీరావుపేటకు చెందిన చొక్కయ్యగారి శ్రీనివాస్ కుమారుడు సాయిచరణ్. గంభీరావుపేటలోని ఒక ప్రైవేటు పాఠశాలలో హైస్కూల్ విద్య పూర్తిచేశాడు. చిన్నప్పటి నుంచే గణితం, భౌతికశాస్త్రం అంటే మక్కువ ఎక్కువ. టెన్త్‌లో 9.2 జీపీఏ సాధించాడు. హైదరాబాద్‌లోని కార్పొరేట్ కళాశాలల్లో చదివేందుకు ఆర్థిక పరిస్థితులు అనుకూలించలేదు. తన స్నేహితులు కోచింగ్‌కు వెళ్లినా.. సాయిచరణ్ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వెళ్లలేకపోయాడు. కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చేరాడు. ఇంటర్ ఎంపీసీలో వెయ్యికి 969 మార్కులు సాధించాడు. ఆ తర్వాత జేఈఈ, ఎంసెట్‌లోనూ అర్హత సాధించాడు. మళ్లీ ఆర్థిక పరిస్థితులు, తండ్రి అనారోగ్య సమస్యలు ఎదురై ఇంజినీరింగ్ చేయలేకపోయాడు. ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపస్ సైఫాబాద్‌లో డిగ్రీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ చదివి 8.58 సీజీపీఏతో ఉత్తీర్ణుడయ్యాడు.
పర్యావరణ అధ్యయనాలపై ఆసక్తి
సాయిచరణ్‌కు చిన్నప్పటి నుంచి సైన్స్, పర్యావరణ అధ్యయనాలపై ఆసక్తి ఎక్కువ. ఈ క్రమంలో శాటిలైట్ డాటా ద్వారా భూపరిశీలన(ఎర్త్ అబ్జర్వేషన్), పర్యావరణ విశ్లేషణ చేసే జియో ఇన్ఫర్మెటిక్స్ గురించి తెలుసుకున్నాడు. ఇందులో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశాడు. ఈ దశలో వాతావరణ మార్పులు, సుస్థిరత, పర్యావరణ పరిరక్షణపై తనకున్న నిబద్ధతను మరింత బలోపేతం చేశాయి.
వ్యవసాయంపై దృష్టి..
తూర్పు తెలంగాణలో వరద మ్యాపింగ్, వ్యవసా యం, పశువుల నుంచి వెలువడే మిథేన్ ఉద్గారాల పై సాయిచరణ్ అనేక జాతీయ సదస్సుల్లో పరిశోధనా పత్రాలు సమర్పించాడు. దేశానికి వెన్నెముకగా ఉండి 60 శాతం మంది జనాభాకు జీవనాధారమైన వ్యవసాయరంగంపై ఆయన దృష్టి సారించాడు. శాసీ్త్రయ ప్రణాళికల ద్వారా, నీటి వినియోగాన్ని నియంత్రిస్తూ, భూసారం తగ్గకుండా, కార్బన్ సీక్వెస్ట్రేషన్ పెంచుతూ రైతులు అధిక దిగుబడి సాధించవచ్చని సాయిచరణ్ అపార విశ్వాసం.
జీవితంలో మలుపు..
2020లో మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా పర్యటన సందర్భంగా సాయిచరణ్ అక్కడి రైతులు యాసంగిలో ఎదుర్కొంటున్న నీటిఎద్దడిని కళ్లారా చూశాడు. ఆ పర్యటన తన జీవితంలో కీలకమలుపుగా సాయిచరణ్ చెబుతుంటాడు. తన అనుభవం ద్వారా నీటిని పొదుపు చేయడానికి ఎల్‌నినో, కరువు వంటి భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవడానికి పంటరకం, ఎదుగుదల దశల ఆధారంగా నీటి అవసరాలను ప్లాన్ చేయడం ఎంతముఖ్యమో గ్రహించాడు. అప్పటి నుంచి ‘నాసా’, ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన అగ్రికల్చరల్, హైడ్రోలాజికల్ నమూనాలు అధ్యయనం చేశాడు. నీటి వినియోగాన్ని లెక్కించడానికి శాటిలైట్ ఆధారిత ‘ఎవాపోట్రాన్స్‌పిరేషన్’ అంచనా, కచ్చితమైన సాగునీటి సలహాలను అందించే ‘సాయిల్ వాటర్ బ్యాలెన్స్’ మోడల్స్‌పై పని చేశాడు.
రిమోట్ సెన్సింగ్ అనలిస్ట్‌గా..
సాయిచరణ్ ప్రస్తుతం నిరుతి సంస్థలో రిమోట్ సె న్సింగ్ అనలిస్ట్‌గా పనిచేస్తున్నాడు. రిటైర్డ్ నాసా శాస్త్రవేత్త, సంస్థ వ్యవస్థాపకులైన రామకృష్ణ నేమని పర్యవేక్షణలో పనిచేస్తున్నాడు. ఆయన అనుభవం, మార్గదర్శకత్వంలో శాసీ్త్రయ ఆలోచన విధానాన్ని, పరిశోధన పద్ధతులను మెరుగుపరుచుకున్నాడు.
నా ప్రయాణంలో మద్దతుగా నిలిచిన ఉపాధ్యాయులు, గురువులకు ధన్యవాదాలు. భవిష్యత్‌తరాల కోసం సుస్థిర పర్యావరణ పర్యవేక్షణ, ప్రణాళికలో నా వంతు కృషి చేస్తా. సైన్స్ ద్వారా సమాజానికి సేవ చేయడం కొనసాగించడానికి ‘ఎర్త్ సైన్సెస్’లో పీహెచ్‌డీ చేయాలని ఆశిస్తున్నా. – సాయిచరణ్


