
లోడు దించాల్సిందే..
● రాచర్లబొప్పాపూర్‌లో లారీని అడ్డుకున్న రైతులు
ఎల్లారెడ్డిపేట/గంభీరావుపేట(సిరిసిల్ల): నాట్లు వేసి నెల రోజులు దాటుతున్నా యూరియా వేయకపోవడంతో పొలాలు ఎర్రబడుతున్నాయని మండలంలోని రాచర్లబొప్పాపూర్ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాచర్లబొప్పాపూర్‌కు గురువారం లారీ లోడ్ యూరియా బస్తాలు రాగా.. అందులో కొన్నింటిని వేరే గ్రామానికి తీసుకెళ్లేందుకు అధికారులు ప్రయత్నించగా రైతులు అడ్డుకున్నారు. 500 మంది క్యూలైన్‌లో ఉండగా.. 460 బస్తాలు మాత్రమే వచ్చాయి. అందులోనూ 240 దింపి మిగతా వాటిని గంభీ రావుపేటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా రైతులు అడ్డుకున్నారు. ఏవో రాజశేఖర్ అక్కడికి చేరుకొని మరో లోడ్ వస్తుందని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. సీఐ శ్రీనివాస్‌గౌడ్ అక్కడికి చేరుకున్నారు. ఏవో హామీతో యూరియా లోడుతో ఉన్న లారీని అక్కడ నుంచి వెళ్లనిచ్చారు.
ఉదయమే చెప్పుల క్యూలైన్
గంభీరావుపేట మండలం కొత్తపల్లి సింగిల్‌విండో గోదాం వద్ద గురువారం ఉదయమే రైతులు చెప్పులు, బండరాళ్లను క్యూలైన్‌లో పెట్టారు. అధికారులు స్పందించి సరిపడా యూరియా బస్తాలు ఇప్పించాలని రైతులు కోరుతున్నారు. గంటల కొద్దీ నిరీక్షించినా సరిపడా యూరియా ఇవ్వడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.