ధాన్యం కొనుగోలు చేయండి
● సిరిసిల్ల, చందుర్తిలలో రోడ్డెక్కిన రైతులు
సిరిసిల్లటౌన్/చందుర్తి(వేములవాడ): ధాన్యం వర్షార్పణం కాకుండా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ రైతులు సిరిసిల్ల, చందుర్తిలలో గురువారం రోడ్డెక్కారు. కలెక్టరేట్ ఎదుట రాస్తారోకో చేపట్టి మాట్లాడారు. తాము పండించిన ధాన్యం ఇప్పటి వరకు కొనుగోలు చేయడానికి పూర్తి స్థాయి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. సమీప జిల్లా నిజామాబాద్‌లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు కూడా ఇస్తున్నారని, మన జిల్లాలో పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ఎదురుచూసుడే అవుతుందన్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోకపోతే తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి తదితరులు రైతులకు సంఘీభావం తెలిపారు.
చందుర్తిలో..
రైతులు ధాన్యం కొనాలని కోరుతూ చందుర్తి బస్టాండ్‌లో బైఠాయించారు. రెండు వైపులా వాహనాలు నిలిచిపోవడంతో ఎస్సై అంజయ్య తన సిబ్బందితో అక్కడికి చేరుకొని రైతులను అక్కడి నుంచి బలవంతంగా లాగేశారు. అనంతరం ధాన్యం కల్లాల ఏర్పాటుకు 176 సర్వే నంబర్‌లో స్థలాన్ని కేటాయించాలని తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. రైతులు సిరికొండ శ్రీనివాస్, సిర్రం తిరుపతి, మర్రి రాజు, మెంగని రవి, షిర్డి మల్లేశం, సిర్రం మల్లేశం, తిప్పని భూమేశ్, మర్రి మల్లేశం, మర్రి రమేశ్, మేడిశెట్టి శ్రీహరి, మర్రి లక్ష్మీరాజం, మర్రి రాములుతో పాటు 50మంది రైతులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు చేయండి


