తడిసి మోపెడాయె!
గ్రామాల స్వరూపం ఇలా..
వదిలింది ఎంత.. వచ్చింది ఎంత?
● ఎన్నికల ఖర్చు రూ.171.35 కోట్లు ● లెక్కలేస్తున్న అభ్యర్థులు ● 260 గ్రామాలు.. 2,268 వార్డులు
సిరిసిల్ల: గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డుసభ్యులుగా పోటీచేసిన అభ్యర్థులు డబ్బును మంచినీళ్లలా ఖర్చు పెట్టేశారు. గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లిన అభ్యర్థులు అనుచరులకు నిత్యం మందు, భోజనంతోపాటు ప్రచార సామగ్రికి బోలెడంతా వెచ్చించారు. పోలింగ్‌కు చివరి రెండు రోజులు ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు కొందరు మందుతోనే సరిపెట్టగా.. మరికొందరు మందుతోపాటు డబ్బులు, మహిళలకు చీరలను కానుకగా ఇచ్చారు. ఇలా పెట్టిన ఖర్చు తడిసిమోపైడెంది.
● రూ.171.35 కోట్ల వ్యయం
జిల్లా వ్యాప్తంగా 260 గ్రామాలు, 2,268 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. పోటీచేసిన అభ్యర్థుల ఖర్చు అనధికారిక లెక్కల ప్రకారం రూ.171.35కోట్లు దాటిందని సమాచారం. జిల్లాలో 27 గ్రామాల సర్పంచ్ స్థానాలు, 676 వార్డుసభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవాల వెనక భారీ ఒప్పందాలు జరిగాయి. మొత్తంగా జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల నుంచి ఆవిరైన సొమ్ము దాదాపు రూ.171.35కోట్లు.
● ఇదీ ఓ తండా ఏకగ్రీవం వెనక ఉన్న కథ
జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరిగిన కోనరావుపేట మండలంలోని ఓ తండాలో సర్పంచ్ స్థానం ఏకగ్రీవం చేసేందుకు సదరు అభ్యర్థి గ్రామాభివృద్ధికి రూ.11.50 లక్షలు ఇచ్చే ందుకు అంగీకరించినట్లు సమాచారం. ఉపసర్పంచ్ అభ్యర్థి రూ.1.60లక్షలు ఇచ్చేందుకు అంగీకరించారు. మరో త ండాలో గ్రామపంచా యతీ భవన నిర్మాణా నికి రూ.20లక్షల విలువై న సొంత భూమిని ఇచ్చేందుకు ముందుకురావడంతో ఏ కగీవ్రమైంది. ఇలా ఏకగ్రీవ ఎన్నికల తెరవెనక మతలబు జరిగినట్లు సమాచారం.
● నోట్లకు లొంగని ఓటర్లు
ఓ మేజర్ పంచాయతీలో బరిలో ఉన్న ప్రధాన పార్టీ అభ్యర్థులు ఓటర్లకు భారీ ఎత్తున డబ్బులు పంపిణీ చేయగా.. ఓ పార్టీ అభ్యర్థి మాత్రం చేతులు జోడించి ఏ సమయంలో మీకు పని ఉన్నా అందుబాటులో ఉంటానంటూ ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశాడు. ప్రత్యర్థి మాత్రం ఓటుకు రూ.వెయ్యి చొప్పున పంపిణీ చేస్తూ రూ.1.20కోట్లు వెచ్చించాడు. ఫలితం మాత్రం పెద్ద ఖర్చులేమి లేకుండా చేతులు జోడించి ఓట్లు అభ్యర్థించిన అభ్యర్థి గెలవడం విశేషం. రెండో విడత ఎన్నికలు జరిగిన మరో మేజర్ గ్రామంలోనూ ఇలాగే ఓటర్లకు నోట్లు ఇవ్వకుండా ఎన్నికలకు ముందురోజు ఇంటికో క్వార్టర్ మందు పంపిణీ చేసినట్లు సమాచారం. అంతే ఎన్నికల్లో ఓట్ల సునామీతో విజయం సాధించినట్లు తెలిసింది.
● ఇవీ నిబంధనలు
5వేల జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థి రూ.1.50లక్షలు, వార్డు సభ్యుడు అభ్యర్థి రూ.50వేలు మాత్రమే ఖర్చు చేయాలి. 5 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థి రూ.2.50లక్షలు, వార్డు సభ్యుడు రూ.50వేలకు మించి ఖర్చు చేయడానికి వీలు లేదు. ఈమేరకు 76 రకాల ఎన్నికల సామగ్రి, ప్రచార వస్తువులకు ఎన్నికల సంఘం ధరలు నిర్ధేశించింది. కానీ వాస్తవంలో ఆ లెక్కలు ఏ మూలకూ సరిపోవు. బరిలో నిలిచిన అభ్యర్థులు అందరూ ఎన్నికలు జరిగినా 45 రోజుల్లో ఎన్నికల వ్యయాన్ని నిర్ణీత ఫార్మాట్‌లో బిల్లులతో సహా జిల్లా అధికారులకు సమర్పించాలి. లేకుంటే మరోసారి పోటీ చేసే అర్హత ఉండదు.
ఓటర్లు గ్రామాలు
500 56
501–1000 59
1001–1,500 61
1.501–2,000 32
2001–3000 27
3001–4000 12
4001–5000 4
5001–6000 3
6001–7000 2
7001–9000 4
జిల్లాలో మూడు విడతల ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఎంత ఖర్చు అయ్యింది.. ఎన్ని ఓట్లు వచ్చాయని లెక్కలు వేస్తున్నారు. ఎక్కడ మోసం జరిగింది.. ఓటమికి కారణాలేమిటీ? ప్రత్యర్థి గెలుపునకు అనుకూలించిన పరిస్థితులు ఏమిటి? అని ఆరా తీస్తున్నారు. ఏది ఏమైనా జిల్లా వ్యాప్తంగా గ్రామపంచాయతీ ఎన్నికలు ‘లక్ష’ణమైన తీర్పుతో కొత్త చరిత్రను సృష్టించాయి.
తడిసి మోపెడాయె!


