ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో తగ్గిన నేరాలు
సెల్ ఫోన్‌ల రికవరీలో టాప్
సైబర్ నేరాల ఛేదనలో ముందంజ
ఎస్పీ మహేశ్ బీ గితే
సిరిసిల్లక్రైం: జిల్లాలో 2025లో పోలీసు శాఖ అమలు చేసిన స్నేహపూర్వక, పారదర్శక పోలీసింగ్ విధానాలతో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని ఎస్పీ మహేశ్ బీ గితే తెలిపారు. 2024తో పోలిస్తే 2025లో నేరాలు 14.04 శాతం తగ్గినట్లు వివరించారు. మంగళవారం క్రైం రివ్యూలో వివరాలు వెల్లడించారు.
● గ్రామస్థాయి విజిబుల్ పోలీసింగ్, నైట్ పెట్రోలింగ్ వ్యవస్థ బలోపేతంతో దోపిడీలు, ఇంటి దొంగతనాల కేసులు తగ్గాయి పేర్కొన్నారు.
● నేరస్తులపై కఠిన చర్యలు, వెంటనే కేసులు ఛేదించడం వల్ల ప్రజల్లో భద్రతాభావం పెరిగిందన్నారు.
● అత్యాచార కేసులు కొంత పెరిగిన అంశంపై స్పందించారు. షీ టీమ్, భరోసా కేంద్రాల ద్వారా అవగాహన పెరిగిందని, గతంలో బయటకు రాని బాధితులు ఇప్పుడు ఫిర్యాదు చేస్తున్నారని, ఇది నేరాల పెరుగుదల కాదని, నమ్మకం పెరిగిన ఫలితమని స్పష్టం చేశారు.
● రోడ్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమాలు, స్పీడ్ బ్రేకర్లు, సైన్ బోర్డులు, డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ప్రమాదాల నియంత్రణకు దోహదపడ్డాయని వివరించారు.
● సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక బృందాలతో ఆధునిక సాంకేతికత వినియోగించి ఇతర రాష్ట్రాల నిందితులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. బాధితులకు భారీగా నగదు రీఫండ్ చేసినట్టు తెలిపారు.
● 2025లో 95 కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకున్నామని, 3 హత్య కేసుల్లో జీవితఖైదు పడేలా సాక్ష్యులను ప్రవేశపెట్టి సత్ఫలితాలు సాధించామన్నారు.
● జిల్లాలో వివిధ సందర్భాల్లో దొంగిలించబడిన, పోగొట్టుకున్న 779 ఫోన్లను సీఈఐఆర్ అప్లికేషన్ ద్వారా గుర్తించి 611 ఫోన్స్ బాధితులకు అప్పగించామన్నారు. 2025లో 339 ప్రాపర్టీ కేసులు నమోదు కాగా, 144 కేసులు ఛేదించి రూ.39,53,137 విలువైన ఆస్తి రికవరీ చేయడం జరిగిందని వివరించారు.
● జిల్లాలో గంజాయిని పూర్తిగా నియంత్రించేందు 49 కేసులు నమోదు చేసి 141 మందిని అదుపులోకి తీసుకొని 4.740 కిలోల గంజాయిని సీజ్ చేశామని, యువతను పెడదోవ పట్టించే గాంజా, డ్రగ్స్‌ను జిల్లాలో పూర్తిగా రూపుమాపేలా ముందుకు సాగుతామన్నారు. 2026లో కూడా జిల్లాను నేరరహితంగా మార్చేందుకు మరింత దృష్టి సారిస్తామని, దీని ప్రజలు సహకరించాలని ఎస్పీ కోరారు.
జిల్లాలో 2024, 25లో కేసుల వివరాలు..
కేసులు 2024 2025
అత్యాచారం 20 31
నమ్మక ద్రోహం 15 25
హత్యలు 1 6
చోరీలు 12 7
కిడ్నాప్ 24 11


