పండుగలు సంతోషంగా జరుపుకోవాలి
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని బీవైనగర్‌లో బేతెస్థా బాప్టిస్ట్ చర్చి ఆవరణలో మంగళవారం ముందస్తుగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించగా, ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, క్రిస్మస్ వేడుకల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో నియోజకవర్గానికి రూ.2 లక్షలు మంజూరు చేసిందన్నారు. పండుగ నేపథ్యంలో ప్రేమ, సంతోషాలను పంచాలని పేర్కొన్నారు. అందరికీ ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. సిరిసిల్ల ఆర్డీవో సీహెచ్.వెంకటేశ్వర్లు, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి భారతి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న తదితరులు పాల్గొన్నారు.
మెనూ ప్రకారం భోజనం పెట్టాలి
విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. జిల్లా కేంద్రంలోని జ్యోతిబాపులే విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా స్టోర్ రూమ్‌లో ఆహార సామగ్రి, కోడిగుడ్లు, కూరగాయలు పరిశీలించారు. ఈ సందర్భంగా 6వ తరగతి విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులందరూ చదువుపై శ్రద్ధ పెట్టాలని, తాము అనుకున్న ఉద్యోగాలు, ఉన్నత స్థానాలకు ఎదగాలని, జీవితంలో ఆర్థికంగా స్థిరపడాలని ఆకాంక్షించారు.


