ప్రతీ వ్యక్తి విజయంలో పుస్తక పఠనం కీలకం
సిరిసిల్లకల్చరల్: విద్యార్థుల లక్ష్య సాధనకు మార్గదర్శిగా పని చేసే ఉపయుక్త గ్రంథం ప్రతి విద్యా సంస్థలో తప్పనిసరిగా ఉండాలని వక్తలు అన్నారు. జిల్లా కేంద్రంలో పిల్లల వైద్యుడు గుండ్లూరి సురేంద్రబాబు రచించిన విద్యార్థుల విజయానికి 18 సూత్రాలు పుస్తకాన్ని హైదరాబాద్‌లో జరుగుతున్న 38వ బుక్ ఫెయిర్‌లో మంగళవారం ఆవిష్కరించారు. లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ, అదనపు కలెక్టర్, ఎంజేపీఆర్‌ఈఐ జాయింట్ సెక్రెటరీ జీవీ శ్యాంప్రసాద్‌లాల్, సామాజిక సమరసతా వేదిక కన్వీనర్ అప్పాల ప్రసాద్, కథా రచయిత పెద్దింటి అశోక్, బెంగళూర్‌కు చెందిన పేరెంటింగ్ కోచ్ విజయలక్ష్మి అతిథులుగా హాజరై పుస్తకావిష్కరణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రస్తుతం పుస్తక పఠనం తగ్గి, డిజిటల్ పరికరాల వినియోగం పెరిగినా ప్రతీ వ్యక్తి విజయంలో పుస్తక పఠనం కీలకపాత్ర పోషిస్తుందన్నారు. విశ్వాస లోపంతో ఉన్న విద్యార్థులకు ఈ పుస్తకం టార్చ్‌బేరర్‌లా ఉపయోగపడుతుందన్నారు. వైద్య వృత్తిలో బిజీగా ఉన్నప్పటికీ రేపటి తరం కోసం పుస్తకాన్ని వెలువరించిన సురేంద్రబాబును అభినందించారు.


