కూలి పెంచకుంటే వస్త్రోత్పత్తిని ఆపేస్తాం
సిరిసిల్లటౌన్: పవర్లూమ్ కార్మికులు, ఆసాములు, వార్పిన్, వైపని అనుబంధ రంగాల కార్మికులకు వారం రోజుల్లో కూలి పెంచాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు మూశం రమేశ్ డిమాండ్ చేశారు. మంగళవారం సిరిసిల్లలోని పాలిస్టర్ వస్త్రోత్పత్తిదారుల సంఘం వద్ద పవర్‌లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టగా ఆయన మాట్టాడారు. కూలి ఒప్పందం గడువు ముగిసి 20 నెలలు అవుతున్నా మళ్లీ పెంచకుండా యజమానులు తాత్సారం చేస్తున్నారన్నారు. కూలి పెంచకపోవడంతో కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యజమానులు వెంటనే చర్చలు జరిపి వారం రోజుల్లోపు కూలి పెంచాలని లేకుంటే సిరిసిల్లలో అన్ని రకాల వస్త్రాల ఉత్పత్తిని నిలిపివేసి నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కోడం రమణ, ఎగమంటి ఎల్లారెడ్డి, నక్క దేవదాస్, ఉడుత రవి, కుమ్మరి కుంట కిషన్, దూస అశోక్, సబ్బని చంద్రకాంత్, బెజుగం సురేశ్, ఎలిగేటి శ్రీనివాస్, కోడం రవి, స్వర్గం శేఖర్, బింగి సంపత్, గడ్డం రాజశేఖర్, ఆడెపు మోహన్, చంద్రకాంత్ కార్మికులు పాల్గొన్నారు.


