రాజన్నా నీవే దిక్కు | - | Sakshi
Sakshi News home page

రాజన్నా నీవే దిక్కు

Apr 6 2025 1:53 AM | Updated on Apr 6 2025 1:53 AM

రాజన్

రాజన్నా నీవే దిక్కు

వేములవాడ: వేములవాడ రాజన్న ఆలయంలో భద్రత కరువైంది. దేశవ్యాప్తంగా ఏ ఆలయంలోకి వెళ్లినా సెల్‌ఫోన్ల వినియోగం నిషేధమనే బోర్డు కనిపించడమే కాకుండా భద్రత సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేస్తుంటారు. అయితే రాజన్న ఆలయంలోనే ఇలాంటి తనిఖీలు కనిపించవు. సెల్‌ఫోన్‌లు వినియోగంచరాదనే బోర్డులు మాత్రమే కనిపిస్తాయి. ఈ బోర్డుల సాక్షిగానే భక్తులు తమ సెల్‌ఫోన్లలో సెల్ఫీలు దిగుతూ సోషల్‌మీడియాలో పోస్టు చేస్తుంటారు. ఇదంతా అధికారుల కళ్లముందే జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. అయితే ఆలయంలో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది సైతం సెల్‌ఫోన్లు వినియోగిస్తూ కనిపించడం గమనార్హం.

● వేములవాడ ఆలయంలో భద్రత అంతంతే..

● ఆలయంలో సెల్‌ఫోన్ల వినియోగం

● అడ్డుకోని ఆలయ అధికారులు

● పనిచేయని సీసీ కెమెరాలు

● అటకెక్కిన డోర్‌ మెటల్‌ డిటెక్టర్లు

బోర్డులపైనే నిబంధనలు

భక్తుల రద్దీ మధ్య నిషేధ బోర్డులు గోడలకే పరిమితమవుతున్నాయి. ఆలయంలోకి వచ్చే ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద ఎలాంటి తనిఖీలు చేపట్టకపోవడంతో ఆలయంలోకి సెల్‌ఫోన్లు యథేచ్ఛగా వస్తున్నాయి. రాజరాజేశ్వరస్వామి దేవస్థానం ప్రాంగణంలో ‘ఫోటోలు తీయరాదు’, ‘వీడియోలు నిషేధం’ అనే బోర్డులు ఏర్పాటు చేశారు. అయితే అధికారుల తనిఖీలు లేకపోవడంతో భక్తులు యథేచ్ఛగా ఆలయ ప్రాంగణంలోనే సెల్ఫీలు దిగుతూ కనిపిస్తుంటారు. ఈ దృశ్యాలు ఇక్కడ నిత్యకృత్యం.

ఏడు దారుల్లో భద్రత ఏదీ ?

రాజన్నను దర్శించుకునేందుకు ఆలయంలోకి వెళ్లేందుకు ఏడు దారులు ఉన్నాయి. తూర్పు దిశలో మూడు ద్వారాలు, దక్షిణభాగంలో రెండు, ఉత్తర–దక్షణి భాగాల్లో ఒక్కో దారి ఉంది. ఈ ఏడు దారుల్లోనూ ఎలాంటి భద్రత చర్యలు తీసుకోవడం లేదు. పేరుకు కొంత మంది ఎస్పీఎఫ్‌ సిబ్బంది, హోంగార్డులు విధులు నిర్వహిస్తూ సెల్‌ఫోన్లలో తలమునకలవుతున్నారు.

కనిపించని మెటల్‌ డిటెక్టర్లు

రాజన్న ఆలయ భద్రత కోసం ఏర్పాటు చేసిన డోర్‌ మెటల్‌ డిటెక్టర్లు కనిపించకుండా పోయాయి. కోడెలతో డోర్‌ మెటల్‌ డిటెక్టర్లు పాడవుతున్నాయనే సాకుతో వీటిని మూలనపడేశారు. కేవలం హ్యాండ్‌ మెటల్‌ డిటెక్టర్లు నామమాత్రంగా పట్టుకుని విధులు నిర్వహిస్తున్నారు.

సీసీ కెమెరాలు ఉన్నా లేనట్టే..

రాజన్న ఆలయంలో 12కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా ఏం ఫలితం లేకుండా పోతోంది. సీసీ కెమెరాల పనితీరును ఎవరూ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. సీసీ కెమెరాలున్నాయన్న ధ్యాస కూడా లేకుండా పోతోంది. ఇటీవల ఓ భక్తుడు తన డబ్బులు పోగొట్టుకుని సీసీ కెమెరాల్లో పరిశీలిస్తే ఏమాత్రం కనిపించలేదు.

భద్రత చర్యలు తీసుకుంటాం

రాజన్న ఆలయ భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాం. ఎస్పీ, లోకల్‌ పోలీసులతో చర్చలు జరిపి ఆలయ భద్రత మరింత పెంచేందుకు కృషి చేస్తాం. గతంలో ఏర్పాటు చేసిన మెటల్‌ డిటెక్టర్లను పునరుద్ధరిస్తాం. ఆలయ భద్రతపై రాజీపడేది లేదు. భక్తుల రక్షణే మా కర్తవ్యం. ఆలయ ఎస్పీఎఫ్‌ సిబ్బందిని సైతం అప్రమత్తం చేస్తాం. సెల్‌ఫోన్ల వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తాం.

– కొప్పుల వినోద్‌రెడ్డి, రాజన్న ఆలయ ఈవో

రాజన్నా నీవే దిక్కు1
1/3

రాజన్నా నీవే దిక్కు

రాజన్నా నీవే దిక్కు2
2/3

రాజన్నా నీవే దిక్కు

రాజన్నా నీవే దిక్కు3
3/3

రాజన్నా నీవే దిక్కు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement