ఆగమేఘాలపై ఎస్‌ఎంసీ ఎన్నికలు టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్ బాబు కలెక్షన్ కింగ్ అయ్యాడు ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్
యర్రగొండపాలెం: రాష్ట్రంలో అసమర్ధ విద్యా శాఖ మంత్రి లోకేష్ పాఠశాలలపై పెత్తనం చెలాయించేందుకు ఆగమేఘాలపై ఎస్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించాడని, హోం శాఖ మంత్రి అనితమ్మ తోటి మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ఏ మాత్రం పట్టించుకోవడంలేదని ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్‌ఎంసీ ఎన్నికల్లో నియోజకవర్గంలోని 88 పాఠశాలల్లో విజయకేతనం ఎగురవేసిన చైర్మన్‌లు, వైస్ చైర్మన్‌లకు ఆయన శాలువలు కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షుడు ఏకుల ముసలారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని చంద్రబాబు కొత్త పింఛన్లు, ఇంటి స్థలాలకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టారని, ఆయన తనయుడు విద్యా శాఖ మంత్రి లోకేష్ స్కూల్ మానిటరింగ్ కమిటీ ఎన్నికలకు రాత్రికి రాత్రి జీవో విడుదల చేసి రెండు రోజుల్లో ఎన్నికలు జరిపించాడని అన్నారు. ఆ ఎన్నికల్లో పోలీసులను అడ్డుపెట్టుకొని హెచ్‌ఎంలను బెదిరించి దౌర్జన్యంగా అనేక పాఠశాలల్లో తమ పార్టీ సానుభూతిపరులకు పెత్తనం దక్కేలా చర్యలు తీసుకున్నారని అన్నారు. లోకేష్ ఎత్తుగడ అన్ని పాఠశాలల్లో పారలేదని, జగనన్నపై ఉన్న అభిమానంతో విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులను సైతం లెక్కచేయకుండా ఎన్నికల్లో పాల్గొన్నారని చెప్పారు. నియోజకవర్గంలోని 88 పాఠశాలల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారులు చైర్మన్, వైస్ చైర్మన్‌లుగా గెలుపొందారని, ఇదే స్ఫూర్తితో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ వర్గీయులపై పైచేయి సాధించేందుకు చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
కలెక్షన్ కింగ్‌గా ఎరిక్షన్ బాబు..
టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు కలెక్షన్ కింగ్ అయ్యాడని..మద్యం, ఇసుక, మట్టి, రేషన్ బియ్యం, అభివృద్ధి పేరుతో చేపట్టిన వివిధ పనులకు ఆయనకు కప్పం కట్టాల్సిందేనని, ఇదేమిటని ప్రశ్నించేవారిని జైల్లో పెట్టిస్తున్నాడని తాటిపర్తి మండిపడ్డారు. మద్యం ఎమ్మార్పీ ధరలకంటే అదనంగా రూ.20 ఎందుకు వసూలు చేస్తున్నారని, ఆ డబ్బు ఎవరికి వెళ్తుందని ప్రశ్నించిన మహేష్‌రెడ్డి అనే వ్యక్తిని కలెక్షన్ బాబు పోలీసులతో అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించాడని అన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకుల చెప్పు చేతుల్లో పోలీసులు వ్యవహరించడం ప్రజా స్వామ్యానికి కొడ్డలిపెట్టులాంటిదని, అందుకు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. పాఠశాల ల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారులు ఎస్‌ఎంసీ చైర్మన్‌లుగా ఎన్నికవుతారన్న ఉద్ధేశంతో ఆ ఎన్నిక నిర్వహించకుండా వాయిదా వేయడం, ఎటువంటి మెజార్టీ లేకపోయినా అధికారపార్టీ నాయకులు చెప్పిన అభ్యర్థిని చైర్మన్‌గా ప్రకటించడం లాంటి చర్యలకు పాల్పడిన చోట్ల హెచ్‌ఎంలు సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. వారిపై తాము ప్రైవేటు కేసులు వేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కార్యక్రమంలో ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు గంటా వెంకట రమణారెడ్డి, దోమకాల వెంకటేశ్వర్లు, పాలిరెడ్డి కృష్ణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ చేదూరి విజయభాస్కర్, పార్టీ మండల ఉపాధ్యక్షుడు దొగిపర్తి సంతోష్ కుమార్, పట్టణ ఉపాధ్యక్షుడు కందూరి కాశీవిశ్వనాథ్, వివిధ విభాగాల నాయకులు మూడమంచు బాలగురవయ్య, కొప్పర్తి ఓబులరెడ్డి, సయ్యద్ జబీవుల్లా, షేక్ వలి, శేషసేనారెడ్డి, అంగిరేకుల ఆదినారాయణ, ఏలూరి నారాయణరెడ్డి, ఎల్.రాములు, జానకి రఘు, పబ్బిశెట్టి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


