మహిళల భద్రతపై ప్రభుత్వ నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

మహిళల భద్రతపై ప్రభుత్వ నిర్లక్ష్యం

Oct 2 2026 5:32 AM | Updated on Oct 2 2026 5:32 AM

మహిళల భద్రతపై ప్రభుత్వ నిర్లక్ష్యం

● పాలకులపై నిప్పులు చెరిగిన వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం నేతలు

ఒంగోలు సబర్బన్‌: మహిళల భద్రతపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ ధ్వజమెత్తారు. జరుగుమల్లి మండలంలో బీసీ హాస్టల్‌ విద్యార్థినిపై ఒంగోలులో జరిగిన లైంగిక దాడి విషయమై జిల్లా కేంద్రం ఒంగోలు గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పటల్‌ (జీజీహెచ్‌)వద్ద వైఎస్సార్‌ సీపీ నాయకులతో కలిసి రమణమ్మ మీడియాతో మాట్లాడారు. మహిళా నాయకులతో పాటు వైఎస్సార్‌ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరు రవిబాబు, ఒంగోలు పార్లమెంట్‌ పార్టీ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డితో కలిసి ఆమె మాట్లాడారు. ఒంగోలులో దారుణ ఘటన చోటుచేసుకుందని, హాస్టల్లో చదువుతున్న మైనర్‌ విద్యార్థి నిపై అకృత్యం చోటుచేసుకుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న పాపని పరామర్శించేందుకు వస్తే సిబ్బంది అడ్డుకోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం వారి తల్లితోనైనా మాట్లాడతామని అడిగినా అంగీకరించలేదని మండిపడ్డారు. బాధిత బాలికను కలవనీయకుండా అడ్డుకున్నారన్నారు. ఏం జరగకపోతే ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మహిళలకు రక్షణ లేకుండా పోయిందని దుమ్మెత్తిపోశారు. అదే జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో పాదయాత్రలో మహిళలు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా ఆయన చాలా చక్కగా తీసుకొని ప్రతి సచివాలయంలో ఒక మహిళా పోలీసును పెట్టి మహిళలకు ఏ విధంగా భద్రత కల్పించారో చూశామన్నారు. హెచ్‌ఎంపాడు మాజీ ఎంపీపీ, వైఎస్సార్‌ సీపీ లీగల్‌ సెల్‌ నాయకురాలు గాయం సావిత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఒక మహిళా హోమ్‌ మంత్రి, మహిళా కమిషన్‌ ఉన్నారని, వారంతా ఏం చేస్తున్నారని నిలదీశారు. ఇలాంటి సంఘటనలు ఒకటి కాదు.. రాష్ట్రంలో రోజూ జరుగుతూనే ఉన్నాయన్నారు. పైగా విద్యాశాఖ మంత్రి కూడా సీఎం పుత్రుడు నారా లోకేష్‌ అన్నారు. డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ అయితే రాష్ట్రంలోనే ఉండరని మండిపడ్డారు. సుగాలి ప్రీతి ఇన్సిడెంట్‌ను ఏ విధంగా వాడుకొని వాళ్లు ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. వైఎస్సార్‌ సీపీ ఒంగోలు అసెంబ్లీ ఇన్‌చార్జ్‌ చుండూరు రవిబాబు మాట్లాడుతూ ప్రశ్నిస్తానన్న పవన్‌ కళ్యాణ్‌ కనిపించకుండా పోయాడని ఎద్దేవా చేశారు. ఆ రోజు ప్రశ్నించేందుకు వచ్చానన్న నోరు ఈ రోజు ఏమైపోయిందని నిలదీశారు. ఇలాంటి అరాచకాలు ఎన్ని జరుగుతున్నా కళ్లు మూసుకొని నిద్రపోతున్నారని అర్ధమవుతోందన్నారు. తండ్రి లేని చిన్నారికి జరిగిన ఈ దారుణం క్షమించరానిదన్నారు. మత్తు బిళ్లలు మింగినా పరిగెత్తే హోమ్‌ మంత్రి అనిత ఒంగోలులో ఇంతటి దారుణం జరిగితే కనీసం స్పందించలేదని మండిపడ్డారు. 30 వేల మంది ఆడ పిల్లలను అపహరించారని వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ సమయంలో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు ఏమయ్యాడని నిలదీశారు. ఆ రోజు పచ్చి అబద్ధాలు మాట్లాడి ఓట్లు అడుక్కున్నారన్నారు. ఇంతటి దారుణం జరిగితే మంత్రి లోకేష్‌, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌, హోమ్‌ మినిస్టర్‌ అనిత స్పందించాలి కదా.. అని ప్రశ్నించారు. వైఎస్సార్‌ సీపీ ఒంగోలు పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌ బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ బాధిత బాలిక కుటుంబానికి అండగా ఉంటామన్నారు. బాలికను జరుగమల్లి నుంచి ఒంగోలు తీసుకొచ్చిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఇది కేవలం పార్టీల కోసం మాట్లాడటం కాదని, బాధ్యత కలిగిన ప్రభుత్వం ఏం చేస్తోందన్నారు? కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, నాయకులు బడుగు శోభలత, బడుగు మాధవీలత, నాటారు జనార్దన్‌రెడ్డి, పిగిలి శ్రీను, ఆనం శ్రీనివాసరెడ్డి, గుడ్డల వెంకటేశ్వర్లు, మెట్ల వెంకటేష్‌, చందు, శేషాద్రిరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement