పదేళ్ల బాలుడిని గొర్రెలు మేపే పనిలో పెట్టిన తండ్రి యజమాని సరిగా అన్నం పెట్టడం లేదని..అమ్మ దగ్గరికి పంపాలని బాలుడు కన్నీరు సోషల్ మీడియాలో వీడియో వైరల్ జేసీ విచారణ, యజమానిపై కేసు పెట్టాలని ఆదేశం
మద్దిపాడు/దుత్తలూరు(ఉదయగిరి): అనారోగ్యంతో ఉన్న చెల్లెలి వైద్యం కోసం పదేళ్ల బాలుడిని అతని తండ్రి వేరే ఊరిలో గొర్రెలు మేపే పనిలో పెట్టాడు. తల్లిదండ్రుల సంరక్షణలో ఉండి బడికెళ్లాల్సిన బాలుడు గొర్రెలు మేపుకుంటూ.. యజమాని సరిగా అన్నం కూడా పెట్టడం లేదని తల్లి దగ్గరకు వెళ్లాలని కన్నీటి పర్యంతమైన ఉదంతం మద్దిపాడు మండలంలో చోటుచేసుకుంది. అందిన వివరాల మేరకు వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠానికి చెందిన ఊసా ఆశీర్వాదం, ఎస్తేరమ్మ దంపతులు అక్కడ పనులు లేవని నెల్లూరు జిల్లాలోని దుత్తలూరు మండలం నర్రవాడకు వచ్చి అక్కడ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. వారి ఇద్దరు పిల్లల్లో నాలుగేళ్ల చిన్నారి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. వైద్యం చేయించే స్థోమత లేక డబ్బుల కోసం పదేళ్ల కుమారుడు రామయ్యను గొర్రెల కాపరిగా పనిలో పెట్టాలని అతని తండ్రి ప్రకాశం జిల్లాలో తనకు పరిచయం ఉన్న శ్యామలకు చెప్పాడు. ఆమె మధ్యవర్తిత్వంతో బూరేపల్లి పునరావాస కాలనీలో ఆరోగ్యం బాగోలేక ఇంటి వద్ద ఉంటున్న కన్నెగంటి నాగయ్య తన గొర్రెలు మేపే పనిలో ఆ బాలుడిని కూలికి పెట్టుకున్నాడు. ఈక్రమంలో రెండు రోజుల క్రితం రామయ్య బూరేపల్లి పక్కనే ఉన్న రాచవారిపాలెం పొలాల్లో గొర్రెలు మేపుకుంటూ ఉండగా విష్ణుచౌదరి అనే వ్యక్తి బాలుడిని పలకలరించి వివరాలు అడిగాడు. దీంతో తన తండ్రే తనను చెల్లి వైద్యం డబ్బుల కోసం పనిలో పెట్టాడని, యజమాని సరిగా అన్నం కూడా పెట్టడం లేదని..నన్ను అమ్మ దగ్గరకు పంపండి అంటూ బాలుడు కన్నీటి పర్యంతం అయ్యాడు. ఆ మాటలను వీడియో తీసి బుధవారం సోషల్ మీడియాలో పెట్టడంతో అది రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అయింది. దీంతో గురువారం రామయ్య బాబాయి వచ్చి బాలుడిని తీసుకెళ్లాడు. దీనిపై స్పందించిన చైల్డ్ వెల్ఫేర్ అధికారులు, ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారులు విచారణ చేపట్టారు. నెల్లూరు జిల్లా డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి, ఐసీడీఎస్ పీడీ శైలజ, బాలల సంరక్షణాధికారి సురేష్ బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ కుటుంబానికి ఇంటి స్థలంతోపాటు గుండె శస్త్రచికిత్సకు అవసరమైన ఆర్థిక సాయం, పొదుపు సంఘం ద్వారా రుణం, రామయ్యకు విద్య అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం బాలుడిని ఐసీడీఎస్ ఆధ్వర్యంలోని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఆ కుటుంబానికి నిత్యావసర సరుకులను స్థానికులు అందజేశారు. ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి బాలుడిని పనిలో పెట్టుకున్న కన్నెగంటి నాగయ్యను మద్దిపాడు మండల పరిషత్ సమావేశ మందిరంలో విచారించారు. చిన్న పిల్లవాడిని పనిలో పెట్టుకుని వెట్టిచాకిరీ చేయించుకుంటారా అంటూ తీవ్రంగా మండిపడ్డారు. అనంతరం అతనిపై కేసు నమోదు చేయాలని, తహశీల్దార్ అజయ్‌కుమార్‌రెడ్డిని, ఎస్‌ఐ వెంకట సూర్యను ఆదేశించారు.


