ఒంగోలు టౌన్:
పుట్టుక నాది..చావు నాది..బతుకంతా దేశానిదని మహాకవి కాళోజి అన్న మాటలు ఆచరణలో నిరూపించారు ఆదిమూలపు దయాళు. సీఆర్‌పీఎఫ్ సైనికుడిగా దేశ రక్షణ కోసం సరిహద్దులో పోరాడిన దయాళు మరణించిన తర్వాత అవయవ దానంతో మరో ఐదుగురికి పునర్జన్మ ఇచ్చారు. మార్కాపురం జిల్లా గజ్జలకొండ గ్రామానికి చెందిన దయాళు (55) ఇంట్లో ఉండగా ఆకస్మత్తుగా స్పృహ తప్పి పడిపోయారు. తీవ్ర ఆస్వస్థతకు గురైన ఆయన్ను స్థానిక వైద్యుల సూచన మేరకు వెంటనే ఒంగోలులోని కిమ్స్‌కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం బ్రెయిన్ స్టెమ్ హెమరేజైనట్లు గుర్తించిన వైద్యులు వెంటనే అత్యవసర చికిత్స ప్రారంభించారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. గురువారం సాయంత్రం బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్థారించారు. దయాళు కుటుంబ సభ్యులకు కిమ్స్ వైద్యులు అవయవదానం గురించి అవగాహన కల్పించడంతో ఆయన భార్య విజయకుమారి, కూతురు హన్సీ, సోదరులు చైతన్య, శివమణి అందుకు సమ్మతించారు. దీంతో రంగంలోకి దిగిన కిమ్స్ వైద్యుల బృందం జీవన్‌దాన్‌తో అవయవ దాన సేకరణ ప్రక్రియ పూర్తి చేశారు.
దేశం కోసం బతికి..
ఆదిమూలపు దయాళు దేశం కోసం బతికిన సైనికుడు. తన జీవితాన్ని దేశం కోసం త్యాగం చేసిన దేశభక్తుడు. అనుకోకుండా ఆయన బ్రెయిన్ డెడ్ చెందడం, మానవ థృక్పథంతో ఆయన కుటుంబం అవయవదానం చేయడం గొప్ప విషయంగా గజ్జలకొండ గ్రామస్తులు చెబుతున్నారు. బతికి ఉన్నంత కాలం దేశానికి రక్షణ కల్పించిన దయాళు చనిపోయాక ప్రాణాపాయంలో ఉన్న మరికొందరికి జీవితాన్నివ్వడం స్థానికులను కదిలిస్తోంది. అంతేకాకుండా ఆయన పేరు దయాళు. అంటే దయ కలిగిన వాడని అర్థం. అవయవదానం చేయడం ద్వారా ఆయన పేరు నిలబెట్టిన కుటుంబానికి పలువురు సలాం చెబుతున్నారు. ఆస్పత్రి డైరెక్టర్ బి.ఆద్విక్, సీఓఓ అంకిరెడ్డి, డాక్టర్ ప్రవీణ్‌కుమార్ మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అవయవ దానం చేసి గొప్ప మానవత్వాన్ని చాటుకున్నారని కొనియాడారు.
మరొకరికి పునర్జన్మ ఇవ్వడమే:
అవయవదానం చేయడమంటే మరొకరికి పునర్జన్మ ఇవ్వడమే. ఈ నిర్ణయం అనేక కుటుంబాలకు కొత్త జీవితాన్నిస్తుంది. సమాజంలోని ప్రతి ఒక్కరూ అవయవ దానంపై అవగాహన పెంపొందించుకోవాలి. తద్వారా చనిపోయిన మన కుటుంబ సభ్యులను మరికొంతకాలం సజీవంగా ఉంచినట్లవుతుంది.
డాక్టర్ శ్రీహరిరెడ్డి, కిమ్స్ మెడికల్ డైరెక్టర్
ఎందరో అభాగ్యులు:
దేశంలో అవయవాల కోసం ఎంతోమంది వేచి చూస్తున్నారు. బ్రెయిన్ డెడ్ వంటి సమయాల్లో అవయవదానం చేస్తే ఉపయోగపడుతుంది. అవయవ దానం చేసిన వ్యక్తులు భౌతికంగా మన ముందు లేకున్నా ఎక్కడో ఒక చోట మరొకరిలో బతికే ఉంటారు. అవయవ దానం గురించి ప్రతి ఒక్కరూ అవగాహ కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. దయాళు కుటుంబం చూపిన చొరవ, ధైర్యం ఎప్పటికీ మరచిపోలేం.
డాక్టర్ బాల మురళీకృష్ణ, ఎమర్జన్సీ ఫిజీషియన్


