కందుకూరు రూరల్: మండలంలోని పలుకూరు గ్రామానికి శివారు ఎస్టీ కాలనీకి చెందిన ఓ.వెంకటేశ్వర్లు–జ్యోతి దంపతుల మూడేళ్ల కుమారుడు శ్రీహరి గురువారం సాయంత్రం ఇంటి పరిసర ప్రాంతాల్లో ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు. తల్లిదండ్రులు శుక్రవారం కందుకూరు రూరల్ పోలీసుస్టేషన్‌లు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న ఎస్సై బాలకృష్ణ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మూడు బృందాలను ఏర్పాటు చేశారు. ఫిర్యాదు అందిన ఎనిమిది గంటల్లో శ్రీహరిని తల్లిదండ్రులకు అప్పగించారు. కందుకూరులో గాలిస్తుండగా బాలుడి ఆచూకీ తెలుసుకున్నట్లు ఎస్సై తెలిపారు. కుమారుడు దొరకడంతో తల్లిదండ్రులు పోలీసు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కేసును ఛేదించిన కందుకూరు సీఐ, కందుకూరు రూరల్ ఎస్సైతో పాటు ఉలవపాడు, కందుకూరు టౌన్ ఎస్సైలను ఎస్పీ అభినందించారు.
టంగుటూరు: విద్యుత్ శాఖలోని కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని ఏపీ యునైటెడ్ ఎలక్ట్రిసిటి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధానకార్యదర్శి బీ. సుమన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, పీఆర్సీ కమిటీ వేయాలని కోరుతూ సెప్టెంబర్ 21 నుంచి 28 వరకు విజయవాడ టు తిరుపతి వరకు చేపట్టిన మోటార్ బైక్ చైతన్య యాత్ర శుక్రవారం టంగుటూరు చేరకుంది. టంగుటూరులోని సబ్ స్టెషన్, కొండపి రోడ్డులోని సబ్ స్టేషన్‌లో ఉద్యోగులను కలుసుకొని యాత్ర ఉద్దేశాన్ని తెలిపారు. ఈసందర్భంగా సుమన్ మాట్లాడుతూ తెలంగాణా, ఓరిస్సా, మద్యప్రదేశ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో సంస్థలో విలీనం చేసినప్పుడు ఆంద్రప్రదేశ్లో విలీనం చేయడం ఎందుకు సాధ్యం కాదన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్, యునైటెడ్ ఎలక్ట్రిసిటి ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ప్రధానకార్యదర్శి డి.రవికుమార్, ఉపాధ్యక్షులు టి. రాము పాల్గొన్నారు.
దొనకొండ: మండలంలోని కొచ్చెర్లకోటలో విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఎస్‌ఐ ఎల్.రామకృష్ణ తన సిబ్బందితో కలిసి శుక్రవారం దాడి చేశారు. గ్రామానికి చెందిన వినుకొండ కళ్యాణ్‌బాబు అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు తెలుసుకుని ప్రత్యక్షంగా అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 20 క్వార్టర్ సీసాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.3,270, నిందితుడు కళ్యాణ్‌బాబుపై కేసు నమోదు చేసి దర్యాప్తు కోసం రికార్డు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.


