మార్కాపురం: జిల్లా ఏర్పడిన 9 నెలలకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీని నియమించడంతో ఉమ్మడి జిల్లా నుంచి మార్కాపురానికి పోలీసు సిబ్బందిని కేటాయించనున్నారు. పోలవరం ఓఎస్‌డీగా ఉన్న పంకజ్‌కుమార్ మీనా గురువారం మార్కాపురం ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసు సిబ్బందిని విభజించనున్నారు. ఒంగోలులో ఉన్న వివిధ విభాగాల సిబ్బందిని త్వరలో మార్కాపురం పంపనున్నారు. ఎస్పీ నేతృత్వంలో పనిచేసే స్పెషల్ బ్రాంచ్ డీసీఆర్‌బీ, మహిళా పోలీసు, ఇంటలిజెన్స్, సీసీఎస్, ఐటీ కోర్, ట్రాఫిక్ విభాగాలకు సంబంధించి పలువురు సీఐలు, ఎస్సైలతో పాటు సిబ్బంది రానున్నారు. మొత్తం మీద ఒంగోలు నుంచి 400 నుంచి 450 మంది సిబ్బంది వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం జిల్లా కేంద్రం మార్కాపురంలో ఉన్న టౌన్, రూరల్ పోలీసు స్టేషన్లను అప్‌గ్రేడ్ చేస్తూ ప్రతిపాదనలు డీజీపీ కార్యాలయానికి పంపారు. ఈ రెండూ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించిన వెంటనే రెండు స్టేషన్లకు ఎస్‌హెచ్‌ఓలుగా సీఐలను నియమించనున్నారు. మహిళా పోలీసుస్టేషన్ ఏర్పాటుతో పాటు జిల్లా వ్యాప్తంగా నేరపరిశోధనకు ఉపయోగపడే సీసీఎస్ పోలీసుస్టేషన్ కూడా ఏర్పాటు కానుంది. మహిళా పోలీసుస్టేషన్‌తో పాటు ట్రాఫిక్ నియంత్రణకు ట్రాఫిక్ పోలీసు స్టేషన్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఎస్పీ కార్యాలయాన్ని డీఎస్పీ కార్యాలయంలోని పాత భవనానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. క్యాంప్ ఆఫీసు, నివాస గృహంతో పాటు డీఎస్పీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. గురువారం ఎస్పీ రాకతోనే జిల్లా పోలీసు యంత్రాంగం మొత్తం అలర్ట్ అయింది. ఇప్పటివరకూ ఉమ్మడి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజు మార్కాపురం జిల్లాకు కూడా ఇన్‌చార్జి ఎస్పీగా ఉన్నారు. ఈ నెల 30తో ప్రస్తుత డీఎస్పీ నాగరాజు పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో కొత్త డీఎస్పీ నియామకం జరగనుంది. జిల్లా పోలీసు బాస్ మార్కాపురంలో ఉండటంతో నేర నియంత్రణతో పాటు ట్రాఫిక్ కంట్రోల్, దొంగతనాలపై ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది.
ఎస్పీ రాకతో సిబ్బంది కేటాయింపు
ఎస్బీ, ఇంటలిజెన్స్, ఏఆర్, డీసీఆర్‌బీ,
సీసీఎస్ విభాగాల్లో భర్తీ
సుమారు 400 నుంచి 450 మంది
సిబ్బంది రాక


