సింగరాయకొండ: రాంగ్‌రూట్‌లో వస్తున్న లారీని ఢీకొని మోటారు సైకిలిస్టు అడకా మహేందర్ (18) తీవ్రంగా గాయపడి మరణించాడు. ఈ సంఘటన జాతీయ రహదారిపై లారీ యూనియన్ ఆఫీసు సమీపంలో శుక్రవారం ఉదయం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..మండల కేంద్రంలోని గోపాల్‌నగర్‌కు చెందిన మహేందర్ మోటారు సైకిల్‌పై పెరల్ డిస్టిలరీ వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా రాంగ్‌రూట్‌లో వస్తున్న లారీని బలంగా ఢీకొన్నాడు. తీవ్ర గాయాలుకాగా 108లో ఒంగోలు జీజీహెచ్‌కు తరలించే ప్రయత్నంలో ఉండగా మరణించాడు. మహేందర్ ఆ ఇంట పెద్ద కొడుకు. తన స్నేహితుడు శ్రీనును ఫ్యాక్టరీలో వదిలి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. చేతికి అందివచ్చిన కొడుకు మృతి చెందడంపై తల్లిదండ్రులు తీవ్రంగా విలపించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధీర్‌కుమార్ వివరించారు.
సంతమాగులూరు (అద్దంకి రూరల్): సంతమాగులూరు మండలం పాతమాగులూరు శివారు లక్ష్మీపురం సమీపంలో గురువారం రాత్రి బైక్‌పై వెళ్తున్న యువకుడు రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తాత షేక్ మహబూబ్ సుభానీ ఫిర్యాదు మేరకు ఏఎస్సై ఎం.శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు. ఏఎస్సై కథనం ప్రకారం.. నరసరావుపేట మండలం చిన తురకపాలేనికి చెందిన షేక్ మహబూబ్ సుభానీ అలియాస్ సుభానీ (22) కోటప్పకొండ రోడ్డులోని పెట్రోల్ బంకులో పంప్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం సాయంత్రం తన మోటార్ సైకిల్‌పై వినుకొండ వెళ్లాడు. గురువారం రాత్రి తిరిగి బైక్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా పాతమాగులూరు గ్రామ శివారు ఏఎంఆర్ చెక్‌పొస్టు వద్దకు రాగానే కర్నూలు–గుంటూరు జాతీయ రహదారిపై నరసరావుపేట వైపు లారీని బైకు ఢీకొట్టింది. సుభానీ తలకు గాయమై సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. కేసు నమోదు చేసి లారీ డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏఎస్సై వివరించారు.


