గిద్దలూరు రూరల్: చుక్కల దుప్పిని చంపిన కేసులో ముగ్గురు వేటగాళ్లను గుండ్లకమ్మ రేంజి ఆఫీసర్ వీరస్వామి శుక్రవారం అరెస్టు చేశారు. గుండ్లకమ్మ రేంజి పరిధి దిగువమెట్ట అంబవరం బీటు మధ్య అభయారణ్యం ప్రాంతంలో దిగువమెట్ట గ్రామానికి చెందిన గోగుల శ్రీను, భూపని లక్ష్మీ వెంకటనారాయణ, గుర్రం పెద్దగురవయ్యలు గురువారం అటవీ ప్రాంతంలోకి ప్రవేశించి చుక్కల దుప్పి కోసం ఉచ్చు ఏర్పాటు చేశారు. చుక్కల దుప్పి ఉచ్చులో బిగిసుకుని మరణించింది. ఉచ్చులో బిగిసుకుని మరణించిన చుక్కల దుప్పిని గమనించిన అటవీ శాఖ సిబ్బంది విచారణ చేపట్టారు. ఆ విచారణలో దిగువమెట్టకు చెందిన ముగ్గురు ఉచ్చు పెట్టినట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నామని రేంజీ ఆఫీసర్ తెలిపారు. పట్టుబడిన ముగ్గురిని గిద్దలూరు కోర్టులో హాజరు పరచగా జడ్జి వారికి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు.
ఒంగోలు టౌన్: నగరానికి చెందిన డాక్టర్ భూమిరెడ్డి కల్పన పీజీ నీట్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో ర్యాంక్ సాధించింది. నీట్–2026 పరీక్షల్లో ఆల్ ఇండియా 1891 ర్యాంకు సాధించింది. ప్రస్తుతం ఆమె శ్రీకాకుళం జెమ్స్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువు పూర్తి చేసుకున్నారు. పీజీ చేసిన తర్వాత ప్రభుత్వ వైద్యురాలిగా జిల్లా ప్రజలకు సేవ చేయాలని ఉందని డాక్టర్ కల్పన చెప్పారు. వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, వెంకటరెడ్డి దంపతుల ద్వితీయ కుమార్తె కల్పన మొదటి నుంచి చదువులో ప్రతిభ కనబరుస్తున్నారు. జాతీయ స్థాయి ర్యాంక్ సాధించిన డాక్టర్ కల్పనకు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు, నగర అధ్యక్షుడు కటారి శంకర్, జిల్లా నాయకులు అభినందనలు తెలిపారు.
ఒంగోలు టౌన్: మద్యం తాగి ద్విచక్ర వాహనాలు నడుపుతున్న ఐదుగురికి కోర్టు జరిమానా విధించింది. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు నగరంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా మద్యం తాగి వాహనాలు నడుపుతున్న ఆరుగురు పట్టుబడ్డారు. వీరిని శుక్రవారం కోర్టులో హాజరు పరచగా ఐదుగురికి ఒక్కొక్కరికి 10 వేల రుపాయల చొప్పున జరిమానా విధించారు. ఒకరికి ఒక రోజు పాటు జైలుశిక్ష విధించినట్లు ట్రాఫిక్ సీఐ సీహెచ్ హజరత్తయ్య తెలిపారు. వాహనాలు నడిపే సమయంలో మద్యం తాగి నడపరాదని, తాగి నడిపితే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని సీఐ తెలిపారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు తప్పకుండా పాటించాలని కోరారు.
అద్దంకి రూరల్: అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో పాము కనిపించడంతో రోగులు, బంధువులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. శుక్రవారం వైద్యశాలలోని ఇన్‌పెషేంట్ విభాగం వద్ద ఉన్న చెట్టులో పాము కనిపించింది. అక్కడ ఉన్న రోగులు, వారి బంధువులు భయపడుతుండగా వైద్యశాల సిబ్బంది వచ్చి పామును చంపి బయట పడేశారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా వైద్యశాలలోని పరిసర ప్రాంతాలు చిల్లచెట్లు, పిచ్చిమొక్కలు తొలగించి శుభ్రంగా ఉంచాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు.


