మర్రిపూడి: పాముకాటుకు మహిళా కూలీ మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని పాత పన్నూరులో శుక్రవారం జరిగింది. బంధువుల కథనం ప్రకారం.. మండలంలోని పాత పన్నూరు గ్రామానికి చెందిన కరేటి రోశయ్యకు కందుకూరు మండలం జి.మేకపాడు గ్రామానికి చెందిన కుమారితో 14 ఏళ్ల క్రితం వివాహమైంది. రోశయ్య భార్య కరేటి కుమారి (41) శుక్రవారం అదే గ్రామానికి చెందిన రైతు ఎలవర్తి శ్రీను చేలో వరి నాటేందుకు వెళ్లింది. వరి నారు పీకుతున్న సమయంలో నారులో ఉన్న పాము చేతిపై కాటేసింది. దీంతో భయాందోళనకు గురైన కుమారి కేకలు పెట్టింది. పరిస్థితిని గమనించిన తోటి కూలీలు 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. కుమారిని 108లో పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కుమారి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న బంధువులు విలపించారు. కూలి పనిచేసుకుని జీవించే ఆ కుటుంబ పెద్ద రోశయ్య మూడేళ్ల క్రితం క్యాన్సర్ వ్యాధితో మృతి చెందడం, తల్లి పాముకాటుకు గురై మరణించడంతో చిన్నారులు అనాధలయ్యారు.


