లింగసముద్రం: ఆరోగ్యం బాగాలేక ఆర్‌ఎంపీ వద్దకు వెళ్లిన మహిళకు మత్తు ఇంజక్షన్ చేసి లైంగికదాడికి యత్నించిన సంఘటన లింగసముద్రం మండలంలోని పెదపవని గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం.. పెదపవని ఎస్సీకాలనీలో నివాసం ఉంటున్న 25 సంవత్సరాల మహిళకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో తన భర్తతో కలిసి అదే గ్రామంలో ఆర్‌ఎంపీ నజీర్ వద్దకు సోమవారం ఉదయం వెళ్లారు. నజీర్ ఆమెను పరీక్షించి అధిక రక్తపోటు ఉందని, గుండె వేగంగా కొట్టుకుంటోందని చెప్పాడు. మందుల చీటీ రాసి గ్రామంలోని మెడికల్ షాపునకు వెళ్లి మందులు కొనుగోలు చేసి తీసుకురమ్మని భర్తకు చెప్పడంతో అతను వెళ్లాడు. ఆ సమయంలో ఆమెకు మత్తుమందు ఇంజక్షన్ ఇచ్చిన నజీర్.. ఆమె వేసుకున్న నైటీ తొలగించడానికి ప్రయత్నించాడు. అయితే, స్పృహలో ఉన్న బాధితురాలు నిరాకరించింది. కానీ, ఆ తర్వాత కొంతసేపటికే ఆమె స్పృహ కోల్పోవడంతో నజీర్ ఆమె ఛాతిని తాకి లైంగిక దాడికి యత్నించాడు. మరికొంతసేపటికి ఆమెకు స్పృహ రావడంతో నజీర్‌ను తోసివేసింది. అనంతరం అక్కడికి వచ్చిన భర్తకు విషయం చెప్పింది. ఈ విషయం ఎవరికై నా చెబితే చంపుతానని వారిని నజీర్ బెదిరించాడు. దీనిపై సోమవారం రాత్రి లింగసముద్రం పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. నజీర్‌ను పెదపవనిలో మంగళవారం అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
అద్దంకి రూరల్: మద్యంలో గడ్డి మందు కలుపుకుని తాగి అస్వస్థతకు లోనై వైద్యశాలలో చికిత్స పొందుతున్న వ్యక్తి మంగళవారం మృతి చెందాడు. అద్దంకి మండలంలోని తిమ్మాయపాలెం గ్రామంలో చోటుచేసుకున్న ఈ సంఘటనపై వైద్యశాల నుంచి అందిన రిపోర్టు మేరకు సీఐ సుబ్బరాజు కేసు నమోదు చేశారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని తిమ్మాయపాలెం గ్రామానికి చెందిన కనపర్తి పిచ్చయ్య (42) సోమవారం మద్యం సేవించాడు. ఆ మత్తులో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి బయట పెట్టిన పిచ్చిమొక్కలు చంపటానికి తెచ్చిన గడ్డి మందును మద్యంలో కలుపుకుని తాగి కింద పడి ఉన్నాడు. భార్య అంజమ్మ ఇంటికి వచ్చి గమనించి ఏం జరిగిందని భర్తను అడగ్గా.. మద్యంలో గడ్డి మందు కలుపుకుని తాగానని చెప్పాడు. వెంటనే అద్దంకిలోని ప్రభుత్వ వైద్యశాలకు, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఒంగోలు జీజీహెచ్‌కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పిచ్చయ్య మృతి చెందాడు.
మద్దిపాడు: విద్యుదాఘాతంతో స్తంభంపైనుంచి కిందపడి ఒక యువకునికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మద్దిపాడు మండలంలోని తెల్లబాడులో బొడ్రాయి సెంటర్ వద్ద మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. అందిన వివరాల ప్రకారం.. చీమకుర్తి మండలం ఇలపావులూరు గ్రామానికి చెందిన కె.వెంకటేశ్ ప్రైవేటుగా విద్యుత్ పనులు చేస్తుంటాడు. దొడ్డవరం జేఎల్‌ఎం వద్ద ప్రైవేటుగా పనిచేస్తూ మంగళవారం విద్యుత్ స్తంభం ఎక్కాడు. ఎల్‌సీ తీసుకోకపోవడంతో ఆ యువకునికి షాక్ తగిలి స్తంభంపైనుంచి కిందపడిపోయాడు. కుడిచేయి కాలిపోగా ఎడమ చేతి బొటన వేలు విరిగిపోయింది. చికిత్స నిమిత్తం ఒంగోలు జీజీహెచ్‌కి తరలించారు. యువకుని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఒంగోలు టౌన్/వన్‌టౌన్: మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరికి రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చినట్లు ట్రాఫిక్ సీఐ సీహెచ్ హజరత్తయ్య తెలిపారు. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా నగరంలో తనిఖీలు నిర్వహిస్తుండగా 22 మంది పట్టుబడినట్లు చెప్పారు. వారిని కోర్టులో హాజరుపరచగా 20 మందికి ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున జరిమానా, ఇద్దరికి జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.


