ఆత్మస్తుతి.. పరనింద.! | - | Sakshi
Sakshi News home page

ఆత్మస్తుతి.. పరనింద.!

Sep 23 2026 2:06 AM | Updated on Sep 23 2026 2:06 AM

మేదరమెట్ల: కొరిశపాడు మండలం మేదరమెట్లలో మంగళవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఆద్యంతం రాజకీయ వేదికగా కొనసాగింది. కలెక్టర్‌ పి.రాజాబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి విద్యుత్‌ శాఖామంత్రి గొట్టిపాటి రవికుమార్‌ హాజరయ్యారు. ముందుగా దివ్యాంగులకు మోటారు ట్రై స్కూటర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందని, అందుకు విద్యా శాఖామంత్రి లోకేష్‌ చేపట్టిన చర్యలే కారణమని క్రెడిట్‌ చోరీకి పాల్పడ్డారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ పాలనపై విషం చిమ్మేందుకు విశ్వప్రయత్నం చేశారు. అయితే, వాస్తవానికి ప్రభుత్వ పాఠశాలలు పునర్జీవం పొందాయంటే అందుకు గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో అమలుచేసిన నాడు–నేడు కార్యక్రమం కారణమన్న విషయం అందరికీ తెలిసిందే. ఆనాటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన కార్యాచరణతో ప్రభుత్వ పాఠశాలలు నేటికీ కళకళలాడుతున్నాయన్నది కాదనలేని నిజం. కానీ, మంత్రి వ్యాఖ్యలతో అక్కడున్న వారు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. వాస్తవాలను కనుమరుగు చేస్తూ ఆధ్యంతం ఆత్మస్తుతి, పరనిందతో మంత్రి ఉపన్యాసం కొనసాగడంపై ముక్కున వేలేసుకున్నారు.

అందరికీ ఒకేసారి పింఛన్లు ఇవ్వలేం...

తమ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం గురించి గొప్పలు చెప్పే క్రమంలో మంత్రి రవికుమార్‌ మాట్లాడుతూ ప్రస్తుతం పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఏకకాలంలో మంజూరు సాధ్యం కాదనడంతో అర్హులు నిరాశకు గురయ్యారు. అర్హులకు దశల వారీగా పింఛన్లు మంజూరు చేస్తామని చెప్పడంతో.. కార్యక్రమానికి హాజరైన వారిలో పలువురు రెండేళ్ల తర్వాత పింఛన్లకు దరఖాస్తులు తీసుకుంటున్నారని, మళ్లీ దశల వారీగా అంటున్నారని విమర్శించారు. అర్హులకు పూర్తిస్థాయిలో పెన్షన్ల మంజూరు కలగానే మిగులుతుందని, వడపోతల పేరుతో ఎంత మంది అర్హులకు కోతల, వాతలు పెడతారోనని చర్చించుకున్నారు.

మొక్కుబడిగా

ప్రజా సమస్యల పరిష్కార వేదిక...

నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాల నుంచి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రాలతో హాజరయ్యారు. ముందుగా దరఖాస్తుదారుల నుంచి సిబ్బంది వివరాలు నమోదు చేసుకుని ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. అనంతరం మంత్రి, కలెక్టర్‌ అర్జీదారుల సమస్యలు తెలుసుకునే కార్యక్రమం ఆధ్యంతం మొక్కుబడిగా సాగింది. కార్యక్రమానికి హాజరైన వారిలో అధికారులు, సిబ్బందే సింహభాగం ఉన్నారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల పంపిణీ సందర్భంగా సిఫార్సు చేసిన నాయకులకు కూడా ప్రచారం కల్పించేందుకు చేసిన హడావిడి విమర్శలకు తావిచ్చింది. కొందరు టీడీపీ నాయకులు తమ బలనిరూపణకు పోటీపడటంపై హాజరైన వారు పలు రకాల వ్యాఖ్యలు చేశారు.

ఆద్యంతం రాజకీయ వేదికగా కొనసాగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక

క్రెడిట్‌ చోరీకి మంత్రి గొట్టిపాటి విశ్వ ప్రయత్నం

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందని, అందుకు మంత్రి లోకేషే కారణమని కితాబు

వాస్తవానికి గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో నాడు–నేడుతో జీవం పోసుకున్న ప్రభుత్వ పాఠశాలలు

మొక్కుబడిగా మేదరమెట్లలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement