● కలెక్టర్ రాజాబాబు
కురిచేడు: మండలంలోని పడమరకాశీపురం పంచాయతీ జగన్నాథపురం బేచరాకు గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న బౌద్ధ క్షేత్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మల్లికార్జునతో కలిసి మంగళవారం బౌద్ధ క్షేత్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. స్థానికులతో ముచ్చటించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. దేశంలోనే రెండో ప్రాముఖ్యత కలిగిన బౌద్ధ క్షేత్రం మన జిల్లాలో ఉందన్నారు. ఈ చారిత్రక వైభవాన్ని కాపాడి భావితరాలకు తెలిపేలా చర్యలు తీసుకుంటామన్నారు. దీనిని పర్యాటకంగా అన్ని విధాలుగా అభివృద్ధి చేసి అంతర్జాతీయ టూరిస్టులు వచ్చేలా చూస్తామన్నారు. ఇక్కడ ఉన్న శిల్పాలను కూడా భద్రపరుస్తామన్నారు. ఇందుకోసమే బుద్ధిజంపై ఎంతో అధ్యయనం చేశామన్నారు. ఆయా విషయాలపై అపార జ్ఞానం కలిగి అమరావతిలో నిర్మించిన బుద్ధుని విగ్రహ రూపకల్పనలోనూ కీలకపాత్ర పోషించిన సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌తో కలిసి ఈ ప్రాంతానికి వచ్చినట్లు కలెక్టర్ చెప్పారు. దీనిని అభివృద్ధి చేసేందుకు డి.పి.ఆర్. రూపొందించే కన్సల్టెంట్ సంస్థను కూడా తీసుకొచ్చామన్నారు. రాష్ట్ర సాంస్కృతికశాఖ డైరెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ ఇది క్రీస్తుపూర్వం రెండో శతాబ్దం నుంచి క్రీస్తు శకం రెండో శతాబ్దం మధ్య చాలా గొప్ప స్థితిలో ఉన్న ప్రాంతమని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కనుగొన్న 150 స్థూపాలలో ఇదే పెద్దదన్నారు. కాశీ నుంచి కాంచీపురం మధ్యలో ప్రధాన రహదారి వెంట ఉన్న ప్రాంతం కావడం, పక్కనే గుండ్లకమ్మ నది ఉండటంతో ఈ స్థూపం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందన్నారు. విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి బౌద్ధమతంపై పలువురు పరిశోధనలు చేసినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంతో పాటు సమీపంలోని త్రిపురాంతకం ఆలయాన్ని కూడా ఒక సర్క్యూట్‌గా పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. వారి వెంట పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ సురేష్, అసిస్టెంట్ డైరెక్టర్ జరీనాబేగం, పర్యాటక శాఖ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ జయదేవ్, ఆర్డీఓ విజయజ్యోతి కుమారి, డీపీవో అనుపమ, ఏపీసీపీడీసీఎల్ ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, భూగర్భ నీటివనరుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు, గైడ్లు నూనె యోహాను, మోహన్, స్థానిక అధికారులు పాల్గొన్నారు.


