● బంగారం, వెండి, రూ.8 లక్షల నగదు
అపహరణ
మార్కాపురం టౌన్: పట్టణంలోని విజయటాకీస్ ప్రాంతంలో సోమవారం రాత్రి ఒకేసారి ఐదు గృహాల్లో దొంగతనం జరగడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయటాకీస్ ప్రాంతానికి చెందిన షేక్ అక్బర్ బాషా నివాసంలో దొంగలుపడి 15 గ్రాముల బంగారం, 20 తులాల వెండి, 8 వేల రూపాయల నగదు దోచుకెళ్లారు. అదేవిధంగా ఎస్‌కే రజియా నివాసంలో రూ.8 లక్షల నగదు, తులమున్నర బంగారం అపహరించుకునిపోయారు. ఆ మేరకు బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరో నివాసంలో ఎటువంటి వస్తువులు పోలేదు. ఇంకో రెండు నివాసాల్లోనూ దొంగలుపడి వస్తువులను అపహరించినట్లు తెలిసింది. అయితే, ఆయా గృహాల యజమానులు ఊళ్లో లేకపోవడంతో వారికి సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. వారు వచ్చి దొంగతనానికి గురైన వస్తువుల వివరాలు తెలియజేయాల్సి ఉందన్నారు. బాధితుల ఫిర్యాదుల మేరకు పట్టణ ఎస్సై విశ్వనాథరెడ్డి కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీంతో వేలిముద్రలు సేకరించారు. సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలిస్తున్నట్టు ఎస్సై తెలిపారు.


