బల్లికురవ: ప్రమాదవశాత్తూ పళ్ల చక్రం కాళ్లపై పడి గ్రానైట్ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన బల్లికురవ మండలంలోని ఈర్లకొండ క్వారీ వద్ద మంగళవారం జరిగింది. రాజస్థాన్ రాష్ట్రంలోని మకరానా ప్రాంతానికి చెందిన చోటురామ్ (35) స్థానిక క్వారీల్లో వైర్సా ఆపరేటర్‌గా పనిచేస్తున్న మేసీ్త్ర వద్ద ఒప్పంద కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇతను ఆరు నెలల క్రితమే ఇక్కడికి వచ్చి స్థానికంగా నివాసం ఉంటున్నాడు. మంగళవారం పనులకు వెళ్లే ముందు యంత్రాలను సిద్ధం చేస్తుండగా పెద్ద సైజులో ఉన్న స్లాడర్ (పళ్ల చక్రం) కాలిపై పడటంతో కాళ్లు కట్టయ్యాయి. వైద్యం అందేలోపే అతను మృతిచెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై వై.నాగరాజు ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేశారు. చోటురామ్ భౌతిక కాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
తర్లుపాడు: బైక్‌పై వెళ్తున్న భార్యాభర్తల కళ్లలో కారంచల్లి బంగారు సరుడు దోపిడీ చేసిన సంఘటన మంగళవారం తర్లుపాడు మండలంలోని గానుగపెంట – ముత్రాసుకాలనీ మధ్య జరిగింది. తర్లుపాడు మండలంలోని పోతలపాడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గాయం రామకృష్ణారెడ్డి, భార్య కామేశ్వరి బైక్‌పై మార్కాపురం వెళ్లి తిరిగి పోతలపాడు వెళ్తున్నారు. ముత్రాసుకాలనీ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు వారి కళ్లలో కారం చల్లి కామేశ్వరి మెడలోని 4 తులాల బంగారు సరుడు దోచుకెళ్లారు. ఈ సంఘటనపై పోలీసులు విచారిస్తున్నారు.
సంతమాగులూరు (అద్దంకి): మండలంలోని పాతమాగులూరు గ్రామ సమీపంలో 2017లో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో నిందితుడిపై నేరం రుజువు కావడంతో మంగళవారం జడ్జి జైలు శిక్ష విఽధించినట్లు సీఐ శేషగిరిరావు తెలిపారు. మార్కాపురం మండలానికి చెందిన బాధితుడు శ్రీరామ్ రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి సంతమాగులూరు ఎస్సై నాగరాజు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేసి నిందితుడైన గుంటూరు జిల్లా పెద్దకాకానికి చెందిన ఉసాతి ఏడుకొండలుపై న్యాయస్థానంలో చార్జిషీట్ దాఖలు చేశారు. సంతమాగులూరు సీఐ శేషగిరి పర్యవేక్షణలో కోర్టు కానిస్టేబుల్ కృష్ణ సాక్షులను సకాలంలో న్యాయస్థానంలో హాజరుపరిచారు. విచారణలో నిందితునిపై మోపిన నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి బీ అఖిల రూ.10,500 జరిమానా, 3 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు.


