● సుమారు రూ.2 లక్షల నష్టం
నాగులుప్పలపాడు: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో పశువుల పాక దగ్ధమై రూ.2 లక్షల నష్టం వాటిల్లడంతో పాటు ఎద్దుకు కూడా తీవ్రగాయామైంది. ఈ ఘటన నాగులుప్పలపాడు మండలంలోని బీ నిడమానూరు గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి భారీ వర్షం కురవడంతో గ్రామానికి చెందిన నంబూరి రామయ్య, బత్తుల ఆదిశేషులకు చెందిన రెండు ఎడ్లను గ్రామానికి చెందిన ఓరుగంటి వెంకటేశ్వరరెడ్డి పశువుల పాకలో కట్టేశారు. వర్షం పడుతున్న సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన ఒక్కసారిగా మంటలు చెలరేగి పశువుల పాకకు అంటుకున్నాయి. పశువుల పాక పూర్తిగా కాలిపోగా, ఒక ఎద్దు తప్పించుకుని బయటపడింది. మరో ఎద్దు మంటల్లో చిక్కుకోవడంతో శరీరం కాలిపోయి గాయమైంది. గ్రామస్తులు మంటలార్పడానికి ఎంత ప్రయత్నించినా వీలుపడలేదు. పశువుల పాక మొత్తం పూర్తిగా కాలిపోయింది.


