అవినీతిలో కూరుకుపోయి..నాపై విమర్శలా | - | Sakshi
Sakshi News home page

అవినీతిలో కూరుకుపోయి..నాపై విమర్శలా

Sep 22 2026 5:28 AM | Updated on Sep 22 2026 5:28 AM

రేషన్‌ బియ్యం, ఉపాధి హామీ పనులు, గంజాయి, పేకాట నుంచి కమీషన్‌లు వసూలు నీ వ్యవహార శైలిపై టీడీపీ కార్యకర్తల్లోనే అసంతృప్తి అరాచకాలతో మున్సిపల్‌ ఎన్నికల్లో గెలవాలనుకోవడం మీ చేతకానితనం ఎమ్మెల్యే ఇంటూరి తీరుపై మండలి డిప్యూటీ చైర్మన్‌ తూమాటి మండిపాటు

కందుకూరు: స్థానిక ఎమ్మెల్యే అవినీతి వ్యవహారంపై మండలి డిప్యూటీ చైర్మన్‌ తూమాటి మాధవరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేషన్‌బియ్యం, ఉపాధి హామీ పనులు, గంజాయి, పేకాట శిబిరాలు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ వంటి శాఖల నుంచి పెద్ద మొత్తంలో కమీషన్‌లు వసూల్‌ చేసుకుంటూ, పద్ధతి మార్చుకోవాలని సూచించినందుకు తనపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందంటూ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుపై మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం స్థానిక నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

సంస్కారం లేనిది ఎవరికి..

మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికై సొంత మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన మాలకొండ లక్ష్మీనరశింహస్వామి దేవస్థానానికి దర్శనానికి వస్తే కనీస ప్రోటోకాల్‌ పాటించకుండా అధికారులను అడ్డుకుని సంస్కార హీనంగా వ్యవహరించింది మీరు కాదా అంటూ ఎమ్మెల్యేని ప్రశ్నించారు. ప్రోటోకాల్‌ ప్రకారం కనీస మర్యాదను కూడా ఆలయ ఈఓ పాటించలేదని, పైగా గేట్లకు తాళాలు వేసి బయట నుంచో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా ఎమ్మెల్యే నాగేశ్వరరావు ప్రోద్బలంతోనే జరిగిందనే విషయం తనకు అధికారుల ద్వారా తెలిసిందన్నారు. గత ఏడాది రాళ్లపాడు గేట్లు మరమ్మతులకు గురైతే రైతుల మేలు కోసం నిపుణులైన ఫ్రెండ్స్‌ని పిలిపించి సహాయం చేశామని గుర్తు చేశామన్నారు. అలాగే సీఎం చంద్రబాబునాయుడు కందుకూరు పర్యటన సమయంలో సీఎంకు ఏ సమస్యలపై వినతి పత్రం ఇవ్వాలనే విషయంలో స్వయంగా ఎమ్మెల్యే పీఏ తన పీఏకు ఫోన్‌ చేసి అడిగితే గర్బకండ్రిక భూముల విషయం, పట్టణ ట్రాఫిక్‌ సమస్య వంటి ప్రధాన సమస్యలపై ఇవ్వాలని సూచనలు చేశానని, అవే సమస్యలపై నాడు సీఎం వినతి పత్రం ఇవ్వలేదా అని చెప్పారు.

పట్టణ అభివృద్ధి జగన్‌ వల్లే

ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జగన్‌మోహన్‌రెడ్డి పట్టణ అభివృద్ధికి రూ.23 కోట్ల నిధులు మంజూరు చేశారని, ఆ నిధులు ఖర్చు చేసి పనులు చేస్తూ తన ఘనతగా ఎమ్మెల్యే చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. అలాగే ఎంఐజీ లేఅవుట్‌లో ప్లాట్లు అమ్మగా వచ్చే నిధులను పట్టణ అభివృద్ధికి ఉపయోగించుకునేందుకు నాటి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. రూ.350 కోట్లతో సింగరాయకొండ టు పామూరు హైవే, విక్కిరాలపేట రోడ్డు నిర్మాణం వంటి అనేక అభివృద్ధి పనులకి నాటి ప్రభుత్వంలోనే నిధులు మంజూరయ్యాయని వివరించారు. కానీ ఎమ్మెల్యే ఇవి తన ఘనతగా చెప్పుకుంటున్నారని విమర్శించారు.

అక్రమ కేసులతో మున్సిపాలిటీని గెలవలేరు

30 వార్డుల ప్రాతిపదికన మున్సిపల్‌ ఎన్నికలకు వెళ్లేందుకు వైఎస్సార్‌సీపీ సిద్ధంగా ఉందని, కానీ అధికారంలో ఉన్న టీడీపీ ఎందుకు భయపడుతోందన్నారు. విలీన గ్రామాలను మున్సిపాలిటీ నుంచి తొలగించి ఎన్నికలు పెట్టే ధైర్యం ఎందుకు చేయడం లేదన్నారు. దీనికి బదులు గ్రామాల విలీనాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ వేసిన మాజీ కౌన్సిలర్‌ దాసరి మాల్యాద్రిని వేధించేందుకు కాల్‌మనీ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం దారుణం కాదా అని నిలదీశారు. టీడీపీ నేతల ఒత్తిళ్లకు భయపడి అక్రమాలకు పాల్పడుతున్న ఏ ఒక్క అధికారినీ వదిలిపెట్టమని హెచ్చరించారు.

టీడీపీ కార్యకర్తలు తలదించుకునేలా ఎమ్మెల్యే వ్యవహారశైలి

20 ఏళ్ల తరువాత నియోజకవర్గంలో టీడీపీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వ్యవహార శైలితో ఆ పార్టీ కార్యకర్తలు తలెత్తుకుని తిరిగే పరిస్థితి లేకుండా చేశారన్నారు. ఉపాధి హామీ, రేషన్‌ బియ్యం, గంజాయి, పేకాట, రెవెన్యూ, సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం, బరిగొడ్ల లారీలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల నుంచి ఎకరానికి రూ.5 లక్షల చొప్పున వసూల్‌ చేస్తూ అవినీతి సామ్రాట్‌గా మారారని ధ్వజమెత్తారు. టీటీడీ సిఫార్సు లెటర్‌లు అమ్ముకుంటున్న విషయం తన దృష్టికి వచ్చిందని, కడపకు చెందిన సిరిజ అనే మహిళకు రూ.25 వేలకు టీటీడీ లెటర్‌ అమ్మారని చెప్పారు. ఈ విషయం తనకు తెలిసి పద్ధతి మార్చుకోవాలని సూచనలు చేస్తే తనపై తిరిగి విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సమావేశంలో పోలినేనిపాలెం ఎంపీటీసీ చింతలపూడి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement