కనిగిరిరూరల్: సీపీఐలో, ఎస్టీయూ టీచర్స్ సంఘంలో ప్రధాన భూమిక పోషించి, విప్లవ కళాకారుడిగా పేరుపొందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు బృంగి సుబ్రహ్మణ్యం ఆదివారం తుది శ్వాస విడిచారు. దేహదానం చేయాలన్న ఆయన చివరి కోరిక మేరకు సోమవారం కనిగిరి నుంచి సీపీఐ నాయకులు, వారి కుటుంబ సభ్యుల నేతృత్వంలో సుబ్రహ్మణ్యం భౌతికకాయాన్ని తీసుకెళ్లి ఒంగోలులోని మెడికల్ కళాశాలకు అప్పగించారు.
ఒంగోలు సిటీ: వైఎస్సార్ సీపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఒంగోలు రూరల్, ఒంగోలు టౌన్ విస్తృతస్థాయి సమావేశం ఈ నెల 24న నిర్వహించనున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో సమావేశం జరగనుంది. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సమావేశానికి మాజీ టీటీడీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు వైవీ.సుబ్బారెడ్డి, ఉమ్మడి ప్రకాశం జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు అసెంబ్లీ పరిశీలకుడు వెంకటేశ్వర్లు నాయుడు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. అన్ని నియోజకవర్గాల ఇన్‌చార్జిలతోపాటు ఒంగోలు మండల అధ్యక్షుడు మన్నే శ్రీనివాసరావు, ఒంగోలు నగర అధ్యక్షుడు కటారి శంకర్, ఇతర ముఖ్య నాయకులు హాజరుకానున్నారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు సన్మానం
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీల సభ్యులను సన్మానించనున్నారు. అలాగే పార్టీ పదవులు పొందిన వారికి గుర్తింపు కార్డులు అందజేసే కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ కార్యాలయం తెలిపింది. ఈ కార్యక్రమంలో డివిజన్, గ్రామ అధ్యక్షులు, వివిధ విభాగాల అధ్యక్షులు, కమిటీ సభ్యులు, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
● అధికారుల తీరుపై కమిషన్ సభ్యుల ఆగ్రహం
మార్కాపురం: ‘ఎన్నిసార్లు చెప్పినా.. మీలో మార్పురావడం లేదు. మీరు మారరా..’ అంటూ అధికారులపై బాలల హక్కుల కమిషన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మార్కాపురంలోని పలు అంగన్‌వాడీ కేంద్రాలను, హాస్టల్స్‌ను రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు ఉండవల్లి గాంధీబాబు, చల్లా మధుసూదన్‌రావు ప్రశ్నించారు. పట్టణంలోని పెద్దనాగులవరం రోడ్డులో ఉన్న గిరిజన సంక్షేమ హాస్టల్‌ను తనిఖీ చేశారు. పరిసరాలను, విద్యార్థులకు అందిస్తున్న వసతులు, భోజన సదుపాయాలను కమిటీ సభ్యులు పరిశీలించారు. హాస్టల్స్‌లో ఉన్న లోపాలను గుర్తించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో కూడా బాలల కమిషన్, ఫుడ్ కమిషన్ అధికారులు వచ్చి లోపాలు చెప్పినా పరిష్కరించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకుని విద్యార్థులకు మెరుగైన వసతులు, నాణ్యమైన భోజనం అందించాలని హెచ్చరించారు. వారి వెంట డీఈఓ సుబ్బారావు, ఐసీడీఎస్ పీడీ పద్మావతి, జిల్లా బాలల సంరక్షణ అధికారి దినేష్‌కుమార్, ట్రైబల్ అధికారి వెంకటేశ్వర్లు ఉన్నారు.


