విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి గౌడ విభాగం జిల్లా అధ్యక్షుడు తాతా నరసింహగౌడ్
ఒంగోలు సిటీ: మెగా డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాలు జరిగాయని గౌడ విభాగం జిల్లా అధ్యక్షుడు తాతా నరసింహగౌడ్ ఆరోపించారు. డీఎస్సీ నియామకాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం డీఎస్సీ అక్రమాలపై నిలదీసేందుకు విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా కార్యక్రమానికి ఒంగోలు నుంచి బయలుదేరి వెళుతూ మాట్లాడారు. డీఎస్సీ నియామకాల్లో మెరిట్ జాబితా, క్రీడా కోటా పోస్టుల భర్తీపై అనేక అనుమానాలు ఉన్నాయని నరసింహగౌడ్ అన్నారు. ముఖ్యంగా క్రీడా కోటా కింద నియమితులైన అభ్యర్థుల అర్హతలు, క్రీడా ధ్రువపత్రాలను సమగ్రంగా పరిశీలించాలని కోరారు. డీఎస్సీ నియామకాల్లో అధికార పార్టీకి చెందిన నాయకుల అనుచరులకు ప్రయోజనం కల్పించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని, దీనిపై ప్రభుత్వం బహిరంగంగా వివరణ ఇవ్వాలని అన్నారు. కర్నూలు జిల్లాలో కొందరి కుల ధ్రువపత్రాలు, నియామకాలపై కూడా అనుమానాలు ఉన్నాయని పేర్కొంటూ వాటిపై విచారణ చేయాలన్నారు. విజయవాడలో నిర్వహించనున్న ఆందోళన కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు పిలుపు మేరకు ఒంగోలు నుంచి బయలుదేరుతున్నట్లు నరసింహగౌడ్ తెలిపారు. అనంతరం విజయవాడలో శాప్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాకు కార్లలో బయలుదేరి వెళ్లారు. వారిలో వైఎస్సార్ సీపీ నాయకులు తాతా నాంచార్యులు, చందోలు చెంచిరెడ్డి, పరసా వెంకటస్వామి, తాతా శ్రీను, తుళ్లూరి నరేంద్ర, పరసా తిరుపతిస్వామి, తాతా నరేంద్ర, తుళ్లూరి బ్రహ్మయ్య, మాదు శివ, తదితరులు పాల్గొన్నారు.


