సంతమాగులూరు(అద్దంకి): ఇద్దరు యువకులు మద్యం, గంజాయి మత్తులో రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటన మండలంలోని ఏల్చూరు గ్రామంలో శనివారం రాత్రి వినాయక నిమజ్జన సందర్భంగా చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. గణేశ్ నిమజ్జనం ఊరేగింపులో ఏల్చూరుకు చెందిన పోలెబోయిన నారాయణ అతని స్నేహితుడు సాయి ఇద్దరు మద్యం మత్తులో బైకుపై రోడ్లపై చక్కర్లు కొడుతూ హల్‌చల్ చేశారు. ఇదే సమయంలో బీసీ కాలనీకి చెందిన గణేష్ విగ్రహంతో నిమజ్జనానికి స్థానిక బస్టాండ్ సెంటర్ నుంచి చెరువు వైపు వెళ్తున్నారు. ఈక్రమంలో నారాయణ, సాయి ఇద్దరు తమ బైకును గణేష్ ఉన్న వాహనం ముందు అడ్డుగా నిలిపి వాగ్వాదానికి దిగారు. బైకును పక్కకు తీయాలని కోరినా, తీయకపోవడంతో గణేశ్ విగ్రహ వాహనాన్ని ప్రక్కకు తిప్పారు. ఆగ్రహించిన యువకులు వద్దకు చేరుకొని తొగటి వెంకటేష్, సాంబశివరావు అనే అన్నదమ్ముల తలలపై రాళ్లతో దాడిచేసి గాయపరచారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బంధువులు వైద్యశాలకు తరలించారు. అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు రాజీకి చేసిన యత్నాలు ఫలించకపోవడంతో బాధితులు సర్కిల్ సీఐ పీ శేషగిరిరావుకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఏల్చూరులో గణేష్ నిమజ్జనం
ఊరేగింపులో ఘటన
ఇద్దరి తలలకు తీవ్ర గాయాలు


