మట్టిని కొల్లగొట్టి.. | - | Sakshi
Sakshi News home page

మట్టిని కొల్లగొట్టి..

Sep 21 2026 12:38 AM | Updated on Sep 21 2026 12:38 AM

కనిగిరి నియోజకవర్గంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా సీఎస్‌పురం, పామూరు మండలాల్లో యథేచ్ఛగా చెరువుల్లో తవ్వకాలు అభివృద్ధి పనుల మాటున అక్రమంగా మట్టి దోపిడీ కూటమి నేతలే సూత్రధారులు మామూళ్ల మత్తులో అధికార యంత్రాంగం

చెరువులు చెరబట్టి..

అభివృద్ధి మాటున

అక్రమంగా మట్టి దోపిడీ..

నియోజకవర్గంలో జరుగుతున్న గ్రీన్‌ఫీల్డ్‌ హైవే, నేషనల్‌ హైవే రోడ్డు పనులు, నడికుడి–కాళహస్తి రైల్వే అభివృద్ధి పనులు అధికార పార్టీ నాయకులకు వరంగా మారాయి. అభివృద్ధి పనుల మాటున విస్తృతంగా మట్టి దోపిడీకి పాల్పడుతున్నారు. కనిగిరి మండలం బల్లిపల్లి, బాల వెంకటాపురం, యర్రబల్లి, తమటంవారిపల్లి వాగు, అడ్డరోడ్డు, పునుగోడు, చిన ఇర్లపాడు, యడవల్లి, దిరిశవంచ, చెరువుల్లో, కుంటల్లో, సీఎస్‌పురం శివారు ప్రాంతాల్లో కుంటల్లో యంత్రాలతో జోరుగా మట్టిని తవ్వుతున్నట్లు సమాచారం. గ్రీన్‌ ఫీల్డ్‌, నేషనల్‌ హైవే రోడ్డు పనులకు, రైల్వే లైన్‌ పనులకు అధికారుల అనుమతితో తవ్వకాలు చేస్తున్నట్లు కొందరు చెప్తున్నారు. అయితే పగటి పూట తవ్వకాలు అభివృద్ధి పనుల కోసం కాగా.. రాత్రి పూట గ్రామ స్థాయి ద్వితీయ శ్రేణి నాయకులు తమ అక్రమ వ్యాపారం కోసం తవ్వుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఏ చెరువులో ఎన్ని క్యూబిక్‌ మీటర్ల తవ్వకాలకు అనుమతి ఉంది.. మట్టిని ఎవరు తవ్వుకు పోతున్నారనే దాన్ని పరిశీలన చేయాల్సిన ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు కనీసం ఆవైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో గ్రామ స్థాయి టీడీపీ నేతలకు ఇది మంచి వరంగా మారింది. ట్రాక్టర్‌ మట్టిని రూ.800 నుంచి రూ.1000 వరకు, టిప్పర్‌ మట్టి అయితే రూ.3 నుంచి రూ.4 వేలకు అమ్ముతూ జోరుగా వ్యాపారం సాగిస్తున్నారు. ఏ గ్రామంలో ఏకుంటలో, ఏ చెరువులో ఎంత మేరకు మట్టి తవ్వకాలకు అనుమతి తీసుకున్నారు.. అసలు అనుమతి పొందారా లేదా.. అనేది ఆ పంచాయతీ కార్యదర్శి, వీఆర్వోలకు కూడా సమాచారం ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ తవ్వకాల గురించి తెలిసినా వాటిపై ప్రశ్నించేందుకు క్షేత్ర స్థాయి అధికారులు జంకుతున్నారని సమాచారం.

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూటమి నాయకులకు కాదేదీ దోపిడీకి అనర్హం అన్న చందాన మారింది. మట్టి, రేషన్‌, ఇసుక, చిల్లకర్ర, తెల్లరాయి ఇలా ఒకటేమిటి అన్ని రకాలుగా దోపిడీకి పాల్పడుతున్నారు. చెరువులను చెరబట్టి నిత్యం మట్టి తవ్వి తరలించి సొమ్ము

చేసుకుంటున్నారు. దాన్ని అరికట్టాల్సిన అధికార యంత్రాంగం మామూళ్ల మత్తులో జోగుతూ..అధికార పార్టీ

నేతలకు వత్తాసు పలుకుతూ..

మౌనం దాల్చుతున్నారనే ఆరోపణలు

వెల్లువెత్తుతున్నాయి.

కనిగిరిరూరల్‌/పామూరు:

కూటమి నేతల కనుసన్నల్లో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. కనిగిరి నియోజకవర్గంలో చెరువులను ఎక్కడికక్కడ తవ్వేసి గుల్లచేస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మట్టి తవ్వకాలు సాగుతున్నా.. సీఎస్‌పురం, పామూరు మండలాల్లో మట్టి దోపిడీకి అడ్డూ, అదుపు లేకుండా పోయింది. అధికార పార్టీ నేతల అండతో అక్రమార్కులు చెరువులు, కుంటల్లోని మన్నును జేసీబీలు, పొక్‌లైన్‌లతో తవ్వి తరలిస్తున్నారు. సీఎస్‌పురం మండలంలోని ముండ్లపాడులో టీడీపీ నేతల అండతో కొందరు అక్రమార్కులు జోరుగా మట్టిని తవ్వి ట్రాక్టర్లకు తరలిస్తున్నారు. గృహాల పునాదులకు, ఇటుక బట్టీలకు, రియల్‌ ఎస్టేట్‌ ప్లాట్‌లకు తరలిస్తూ..జోరుగా వ్యాపారం సాగిస్తున్నారు. అలాగే జాతీయ రహదారి, గ్రీన్‌ఫీల్డ్‌ హైవే రోడ్డు కోసం అంటూ మట్టిని తోడుతున్నారు. తమ గ్రామంలోని చెరువుల్లో మట్టి తవ్వేస్తున్నారని అధికారులకు చెప్పినా.. నామ్‌కే వాస్తేగా వ్యవహరిస్తున్నారని స్థానికులు తెలిపారు. ఇక పామూరు మండలంలో మట్టి అక్రమార్కుల దోపిడీకి అడ్డు, అదుపు లేకుండా పోయింది. రైతుల భూములు, వాగులు, వంకలు, చెరువులను వదలకుండా కూటమి నేతలు దోచుకుంటున్నారు. మండలంలోని నుచ్చపొద, తిరిగల దిన్నె శివారు గ్రామాల్లో జోరుగా జేసీబీ, యంత్రాలతో చాలా రోజులుగా తవ్వకాలు చేస్తున్నారు. మట్టి దందాతో వాగుల్లో, కుంటల్లో సుమారు 15 నుంచి 20 అడుగుల గోతులు ఏర్పడ్డాయి. ఈ అక్రమ మట్టి రవాణా తంతు అంతా జాతీయ రహదారులపై నుంచే జరుగుతున్నా.. ఏ శాఖ అధికారీ పట్టించుకోవడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా పేదవాడు ఇళ్లు కట్టుకునేందుకు నాలుగు ట్రాక్టర్లు మట్టి చెరువుల్లో నుంచి తోలుకుంటుంటే.. ఆఘ మేఘాలపై వాలి హడావుడి చేసి, పెనాల్టీలు, వాహనాలు సీజ్‌లు చేసే ఇరిగేషన్‌, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు అభివృద్ధి పనుల మాటున అడ్డంగా దోచుకుంటున్న మట్టి మాఫియాపై ఎందుకు నిఘా పెట్టడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

మన్ను తవ్వకమే వ్యాపారంగా..

శివారు ప్రాంతాల్లోని గ్రామాల్లో యథేచ్ఛగా అక్రమ మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. అధికార పార్టీ నేతల అండతో కొందరు వ్యాపారులు చెరువుల్లో, వాగుల్లో, కుంటల్లోని మట్టిని జేసీబీలు, పొక్‌లైన్‌లతో తోడుకుంటున్నారు. హనుమంతునిపాడు మండలానికి చెందిన ఓ ద్వితీయ శ్రేణి నాయకుడు మట్టి తవ్వకాన్నే ఆదాయ వనరుగా మార్చుకుని.. యంత్రాలతో జోరుగా చెరువులు, కుంటలు, వాగుల్లో తవ్వేస్తున్నాడనే ప్రచారం హోరెత్తుతోంది. ఆ ఛోటా నాయకుడికి అధికార పార్టీ నేతల అండ ఉండటంతో అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడరనే ఆరోపణలున్నాయి. అంతేగాక అధికారులకు నెలవారీ నజరానాలు ఠంఛన్‌గా అందిస్తారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఎవరైనా ఇరిగేషన్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా, అడిగినా.. రైల్వే, గ్రీన్‌ ఫీల్డ్‌, హైవే పనులకు మట్టి తరలిస్తున్నారని, చూసి, విచారించి చర్యలు తీసుకుంటామని అధికారులు జారుకుంటున్నారు. ఇక ఇతర శాఖల అధికారులు అది తమ పరిధి కాదంటూ మౌన వ్రతం పాటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement