ఆర్చి నిర్మాణానికి అంగీకరించిన అధికారులు అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుకు సానుకూల స్పందన ఎట్టకేలకు ఆందోళన విరమించిన దళితులు
జె. పంగులూరు: తమ కాలనీ గుర్తింపు కోసం ఆర్చి నిర్మాణం, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసం 40 రోజులుగా ఆందోళన చేస్తున్న నూజిళ్లపల్లి దళితుల పోరాటం ఎట్టకేలకు శనివారం విజయవంతమైంది. ఆర్చి నిర్మాణానికి అధికారుల అంగీకారం తెలపడంతో పాటు అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుకు అధికారులు సానుకూలంగా స్పందించడంతో దళితులు ఆనందంతో ఆందోళన విరమించారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీ నుంచి స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేసిన దళితులు పది రోజులుగా అధికారుల స్పందన లేకపోవడంతో 18వ తేదీ శుక్రవారం ‘చలో పంగులూరు’కు పిలుపునిచ్చారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. శుక్రవారం రాత్రి కూడా కార్యాలయం వద్దే ఉండి అక్కడే వంటావార్పు ఏర్పాటు చేసుకొని పడుకున్నారు. శనివారం కూడా యథావిధిగా తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఏదో ఒక విధంగా దళితుల ఆందోళనను విచ్ఛిన్నం చేయాలని భావించిన అధికారులు భారీ సంఖ్యలో పోలీసు బలగాలను దించారు. అయితే ఉదయం 11.30 గంటల ప్రాంతంలో దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ, అద్దంకి ఆర్డీఓ విజయ జ్యోతికుమారి నూజిళ్లపల్లి దళిత పోరాట కమిటీని, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకులను పిలిచి చర్చలు జరిపారు. చర్చల అనంతరం ఆర్డిఓ విజయ జ్యోతికుమారి తహసీల్దార్ కార్యాలయం వద్దకు వచ్చి ఆందోళన చేస్తున్న దళితులతో మాట్లాడారు. దళితులు కోరుకున్నట్లు కాలనీ ప్రారంభం రోడ్డులో ‘అంబేద్కర్ నగర్’ అనే ఆర్చిని నిర్మించుకోవచ్చని, తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహాన్ని రెండు రోజుల్లో నూజిళ్లపల్లి తీసుకువెళ్లి ప్రస్తుతం దళితులకు అనుకూలమైన ప్రదేశంలో ఉంచి ఆ తర్వాత ఏర్పాటు చేసుకునేందుకు సానుకూలంగా స్పందించారు. ఈ ప్రతిపాదనను దళితులు, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకులు అంగీకరించారు. దీంతో ఆందోళన చేస్తున్న దళితులు సంతోషంగా తమ ఆందోళనను విరమించి తహసీల్దార్ కార్యాలయాన్ని ఖాళీ చేశారు.
ఆర్చీ నిర్మాణ పనులకు గ్రీన్‌సిగ్నల్
ఈ సందర్భంగా ఆర్డీఓ విజయ జ్యోతికుమారి మాట్లాడుతూ ఆదివారమే సర్వేయర్‌నునూజిళ్లపల్లి దళిత కాలనీకి పంపిస్తామని, వెంటనే కొలతలు వేయించి ఆర్చి నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు. రోడ్డులో పైప్ లైన్ ఉందని, దాన్ని తగలకుండా చూడాలని కోరారు. ఆ రోడ్డులో వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఆర్చి నిర్మాణం జరగాలని సూచించారు. ఈ సందర్భంగా దళితులకు మద్దతుగా నిలిచిన కౌలు రైతు సంఘ మాజీ నాయకులు నాగబోయిన రంగారావు, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘ జిల్లా కార్యదర్శి బి.రఘురాం, వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర కోశాధికారి కంకణాల ఆంజనేయులు, కౌలు రైతు సంఘ జిల్లా కార్యదర్శి వి.బాలకోటయ్య, సీఐటీయూ నాయకులు సీహెచ్ మజుందార్, వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి నెరుసుల వెంకటేశ్వర్లు, మహిళా సంఘ నాయకులు కంకణాల రమాదేవి, ఉబ్బా ఆదిలక్ష్మి, నూజిళ్లపల్లి దళిత పోరాట కమిటీ సభ్యులు మాట్లాడుతూ 40 రోజులుగా దళితులు చేస్తున్న పోరాటానికి సానుకూలంగా స్పందించిన అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఆర్చి నిర్మాణంలోనూ, తర్వాత విగ్రహ ఏర్పాటులోనూ అధికారులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పి.కల్పన, పి.రమేష్, చీకటి శ్రీనివాసరావు, గంటెనపల్లి శ్రీనివాసులు, కాలం సుబ్బారావు, రైతు సంఘ జిల్లా నాయకులు తలపనేని రామారావు, శ్రీకాంత్, తాండవ రంగారావు, వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు మొండ్రు ఆంజనేయులు, తంగిరాల వెంకటేశ్వర్లు, సీపీఎం సీనియర్ నాయకులు ఎం.శేషగిరి, నూజిళ్లపల్లి దళితులు, వివిధ దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు


