కృష్ణలంక (విజయవాడ తూర్పు): కష్టపడకుండా తేలికగా అధిక సంపాదనకు ఆశపడి చట్టవిరుద్ధంగా అక్రమంగా పేలుడు పదార్థాలు కొనుగోలు చేసి ఆర్టీసీ బస్సులో రవాణా చేసిన కేసులో ఇద్దరు ప్రధాన నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం సమీపంలోని రాజుపాలెం గ్రామానికి చెందిన అలుగుల లక్ష్మీనారాయణ, అతని తమ్ముడు సాయి కొన్నేళ్ల క్రితం విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలకు వలస వచ్చి మట్టి పనులు, స్లాబులు పగలగొట్టడం, కాంక్రీట్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే వస్తున్న ఆదాయం సరిపోకపోవడంతో లక్ష్మీనారాయణ సులభంగా తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించేందుకు ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకోవాలనుకున్నాడు. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన తన బంధువైన అలుగుల బాబూరావును సంప్రదించాడు. బాబూరావు మార్కాపురం జిల్లా దోర్నాల, చుట్టుపక్కల ప్రాంతాల్లోని క్వారీల్లో పనిచేస్తూ జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు ఉపయోగించి రాళ్లను పగలగొట్టే పని చేస్తుంటాడు. బాబూరావు తన యజమానికి తెలియకుండా కొన్ని జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లను దాచుకుని ఇతరులకు విక్రయించేవాడు. లక్ష్మీనారాయణ ఆ విషయం తెలుసుకున్నాడు. జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లను ఎలా వాడాలి, వాటిని ఉపయోగించి డబ్బు ఎలా సంపాదించాలో తెలుసుకున్నాడు. తన బంధువైన బాబూరావు వద్ద జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లను సేకరించడం ప్రారంభించాడు. వాటిని భవనాల పునాదుల్లో పెద్దపెద్ద రాళ్లను పగలగొట్టేందుకు, రెడీమిక్స్ కాంక్రీట్ లారీల్లో గడ్డ కట్టిన కాంక్రీట్‌ను తొలగించడానికి ఉపయోగిస్తూ గత నాలుగు నెలలుగా వ్యాపారం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే తన మేనల్లుడు రామాంజనేయులును కూడా పనిలో పెట్టుకున్నాడు.
ఆర్టీసీ బస్సులో పేలుడు పదార్థాల రవాణా...
ఈ నెల 14న లక్ష్మీనారాయణ 49 జిలెటిన్ స్టిక్స్, 50 డిటోనేటర్లను బాబూరావు వద్ద రూ.14 వేలకు కొనుగోలు చేశాడు. వాటిని తన మేనల్లుడు రామాంజనేయులుకు ఇచ్చి ఆర్టీసీ బస్సు ద్వారా విజయవాడ పంపించాడు. అయితే విజయవాడ బస్టాండ్‌లో బ్యాగ్ మారడంతో పేలుడు పదార్థాల రవాణా గుట్టురట్టయింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి రామాంజనేయులును అదుపులోకి తీసుకుని విచారించారు. అతను ఇచ్చిన సమాచారంతో ఈ కేసులో లక్ష్మీనారాయణ, సాయిని ప్రధాన నిందితులుగా చేర్చి పరారీలో ఉన్న వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా తన బంధువు వద్ద జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు కొనుగోలు చేస్తూ అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అంగీకరించారు. నిందితులను అరెస్ట్ చేసి రెండో ఏజేఎఫ్‌సీఎం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి శ్రీకాంత్ వారికి 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే రామాంజనేయులును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే.
రిమాండ్ విధించిన కోర్టు అత్యాశకుపోయి జైలు పాలైన ముఠా
నిందితులది యర్రగొండపాలెం సమీపంలోని రాజుపాలెం గ్రామం


