పంగులూరులో ఉద్రిక్తత | - | Sakshi
Sakshi News home page

పంగులూరులో ఉద్రిక్తత

Sep 19 2026 8:38 AM | Updated on Sep 19 2026 8:38 AM

జె.పంగులూరు: మండలంలోని నూజిళ్లపల్లిలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం, ఆర్చి నిర్మాణానికి అధికారులు అనుమతి కావాలని కోరుతూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం తలపెట్టిన ‘చలో పంగులూరు’ కార్యక్రమం ఉద్రిక్తంగా సాగింది. సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆందోళన విరమించేది లేదని దళితులు, దళిత సంఘాల నాయకులు భీష్మించుకుని కూర్చున్నారు. కార్యక్రమం ప్రారంభం నుంచి పోలీసులు అనేక ఆటంకాలు సృష్టించి కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించారు. ఐక్యతతో ఉద్యమం చేస్తున్న దళితులు పట్టు వదలకుండా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.

తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ

ఉదయం 10 గంటలకే సినిమా హాల్‌ సెంటర్‌కు చేరుకున్న నూజిళ్లపల్లి గ్రామ దళితులు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జెండాలు పట్టుకొని నినాదాలు చేసుకుంటూ మెయిన్‌ రోడ్డు మీదగా తహసీల్దార్‌ కార్యాలయం వద్దకు చేరుకొని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అంతకుముందే అక్కడికి చేరుకున్న పోలీసులు అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తూనే ఉన్నారు. నాయకులు మాట్లాడే సందర్భంలో మైకు యజమానిని పిలిచి అతని బండి తాళాలు తీసుకుని మైక్‌ తీసుకెళ్లమని భయపెట్టారు. భయపడిన యజమాని మైక్‌ తీసుకుని వెళ్లిపోయాడు. అయినా దళితులు భయపడకుండా కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ వచ్చి ఆందోళనను ఆపేయాలని, అధికారులతో మాట్లాడతానని పలు రకాలుగా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆయన మాటలు నమ్మని దళితులు తహసీల్దార్‌ కార్యాలయంలోకి వెళ్లి తహసీల్దార్‌తో మాట్లాడేందుకు నిరాకరించారు. దీంతో తహసీల్దార్‌ సింగారావును డీఎస్పీ బాలమురళీకృష్ణ బయటకు పిలిపించారు. బయటకు వచ్చిన తహసీల్దార్‌ సింగారావు నోరు మెదపలేదు. దళితులు అడిగే ఏ మాటకూ సమాధానం చెప్పలేదు. ఆ తర్వాత తహసీల్దార్‌ సింగారావు, అద్దంకి రూరల్‌ సీఐ మల్లికార్జునరావు, అద్దంకి టౌన్‌ సీఐ సుబ్బరాజును డీఎస్పీ తన కారులో బయటకు తీసుకెళ్లారు. తిరిగి సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో డీఎస్పీ వచ్చి కలెక్టర్‌తో మాట్లాడామని, ఆర్చి నిర్మాణానికి మాత్రమే అనుమతి ఇస్తామని చెప్పారని చెప్పడంతో దళితులు అందుకు అంగీకరించలేదు. 40 రోజులుగా చేస్తున్న పోరాటం ఆర్చి కోసమే కాదని, ఆర్చితో పాటు డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటుకు అనుమతి కావాలని, లేకుంటే ఆందోళన విరమించే ప్రశ్న లేదని దళితులు స్పష్టం చేశారు. దీంతో డీఎస్పీ వెనుదిరిగి వెళ్లారు. ఏమైనా సరే రెండు డిమాండ్లు సాధించే వరకు పోరాటం కొనసాగించాల్సిందేనని దళితులు భీష్మించుకుకూర్చున్నారు.

దళితులంటే పాలకులకు చులకన:

కేవీపీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి

రాష్ట్రంలో దళితులు అంటే పాలకులకు, అధికారులకు చులకనగా ఉందని కేవీపీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి ఆందోళన వ్యక్తం చేశారు. 40 రోజులకుపైగా దళితుల దేవుడు అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటామని పోరాడుతుంటే అధికారులు చెవికి ఎక్కలేదని, 80 ఏళ్ల స్వాతంత్ర చరిత్రలో ఇంకా దళితులు తమ హక్కులు సాధించుకోలేక పోవడానికి పాలకులు, అధికారులు కారణమని విమర్శించారు. తాము ఎవరి ఆస్తులు, భూములకు అడ్డు తగలటం లేదన్నారు. తమ సొంత ఖర్చులతో తెచ్చుకున్న విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటామని చెబుతుంటే అందుకు వీల్లేదంటూ అడ్డు తగలటం ఇదెక్కడి న్యాయమన్నారు. కూలి పనులతో బతుకు సాగించే దళితులు తమ హక్కులను సాధించుకునేందుకు పోరాడుతుంటే అభినందించాల్సింది పోయి ఆంక్షలు విధిస్తున్నారని మండిపడ్డారు. అంబేడ్కర్‌ అంటే ఎందుకు ఇంత కక్షపూరిత వివక్ష అని ప్రశ్నించారు. ఏ నాయకుడి విగ్రహాలకు లేని నిబంధనలు అంబేడ్కర్‌ విగ్రహానికి విధించి దళితులు అంటే చులకనగా చూస్తున్నారని ఇది సహించరాని నేరమని ఆండ్ర మాల్యాద్రి మండిపడ్డారు. ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.నరేంద్ర మాట్లాడుతూ దళితులంటే పాలకులకు ఇష్టం లేదని, తమ ఓట్లతో గెలిచి పదవులు అనుభవిస్తూ తమను లెక్క చేయడం లేదన్నారు. దళితుల ఓట్లతో, దళితుల మద్దతుతో పదవులు అనుభవిస్తున్న నాయకులు ఇకనైనా దళితులను మనుషులుగా చూడాలని, లేకుంటే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కౌలు రైతు సంఘ మాజీ రాష్ట్ర నాయకుడు నాగబోయిన రంగారావు, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి బి.రఘురాం, వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి నెరుసుల వెంకటేశ్వర్లు, నాయకులు మొండ్రు ఆంజనేయులు, తంగిరాల వెంకటేశ్వర్లు మాట్లాడారు. కార్యక్రమంలో దళిత హక్కుల పరిరక్షణ సమితి నాయకులు నీలం నాగేంద్రరావు, సీఐటీయూ జిల్లా నాయకులు జీవీ కొండారెడ్డి, సీహెచ్‌ మజుందార్‌, ఈ.కల్పన, కౌలు రైతు సంఘ జిల్లా కార్యదర్శి వి.బాలకోటయ్య, రైతు సంఘ జిల్లా నాయకులు తలపనేని రామారావు, శ్రీకాంత్‌, మహిళా సంఘ నాయకులు రాయిని కృష్ణకుమారి, కంకణాల రమాదేవి, ఉబ్బా ఆదిలక్ష్మి, ఉబ్బా వెంకటేశ్వర్లు, కాలం సుబ్బారావు, జై భీమ్‌రావ్‌ భారత్‌ పార్టీ నాయకులు సుందరం, ఎమ్మార్పీఎస్‌ నాయకులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన దళిత సంఘాల నాయకులు, నూజిళ్లపల్లి దళితులు పాల్గొన్నారు.

తహసీల్దార్‌ కార్యాలయాన్ని

ముట్టడించిన దళితులు

నూజిళ్లపల్లిలో అంబేడ్కర్‌ విగ్రహం పెట్టాల్సిందేనని డిమాండ్‌

సమస్య పరిష్కారమయ్యే వరకు ఆందోళన విరమించేది లేదన్న ఆందోళనకారులు

ఆందోళనకు జిల్లా వ్యాప్తంగా

వివిధ గ్రామాల దళితుల సంఘీభావం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement