పులితో భీకర పోరు.. ప్రాణాలు దక్కించుకున్న ఆవు! | Tiger Hulchul in Prakasam District | Sakshi
Sakshi News home page

పులితో భీకర పోరు.. ప్రాణాలు దక్కించుకున్న ఆవు!

Sep 18 2026 12:37 PM | Updated on Sep 18 2026 1:22 PM

Tiger Hulchul in Prakasam District

వేటాడిన కళేబరాల వద్దకు మళ్లీ వచ్చిన పెద్దపులి (ట్రాప్‌ కెమెరా ఫొటో)

ఒంగోలు: నల్లమల అటవీ సరిహద్దు గ్రామాలపై పెద్దపులి పంజా విసురుతోంది. ఎప్పుడు ఏ పొదల్లోంచి మృత్యువు దూసుకొస్తుందోనన్న భయంతో పల్లెవాసులు కంటిమీద కునుకు లేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అడవికే పరిమితం కావాల్సిన బెబ్బులి.. వరుసగా పశువుల మందలపై విరుచుకుపడుతుండటంతో రైతులు, పశువుల కాపరులు భయాందోళనలకు గురవుతున్నారు. గత వారం రోజుల వ్యవధిలో నల్లమల సమీప ప్రాంతంలో రెండు ఆవులను బలితీసుకోవడంతో పాటు మరో ఆవును తినేందుకు యత్నించిన ఘటనతో బొమ్మలాపురం, పరిసర గ్రామాల ప్రజల గుండెల్లో గుబులు రేగుతోంది. 

మందపై విరుచుకుపడి.. 
గత కొద్ది రోజులుగా బొమ్మలాపురం సమీపంలోని ఊరకొండ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం స్థానికులను హడలెత్తిస్తోంది. ఈ నెల 12వ తేదీన బొమ్మలాపురానికి చెందిన ఓ రైతు తన పశువుల మందను మేత కోసం సమీప అటవీ ప్రాంతంలోకి తోలాడు. ఈ క్రమంలో పెద్దపులి దాడి చేయడంతో రెండు ఆవులు మృతి చెందాయి. అనంతరం మరో ఆవును మట్టుబెట్టేందుకు యత్నించిగా, అది ప్రాణభయంతో పులిని ప్రతిఘటించింది. తీవ్ర గాయాలతో ప్రాణ గండం తప్పించుకున్న ఆ ఆవు యజమాని చెంతకు చేరింది. కాగా, దాడి జరిగిన అదే రోజు సాయంత్రం పెద్దపులి ఆహారం కోసం తిరిగి ఆవుల కళేబరాల వద్దకు రాగా, అటవీశాఖ అమర్చిన ట్రాప్‌ కెమెరాల్లో ఆ బెబ్బులి కదలికలు స్పష్టంగా రికార్డయ్యాయి. 

పొలాలకు వెళ్లాలన్నా ప్రాణసంకటమే! 
పులి దాడి ఘటనతో మూగజీవాలను అడవి వైపు మేతకు తోలేందుకు యజమానులు గజగజ వణికిపోతున్నారు. గతంలోనూ వ్యవసాయ పనులకు వెళ్లే రైతులకు, కూలీలకు పెద్దపులి ప్రత్యక్షంగా కనిపించిన సందర్భాలు ఉన్నాయి. ఆ సమయంలో వారాల తరబడి చేలల్లోకి వెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు. తరచూ పశువులపై దాడులు జరుగుతుండటంతో రైతులకు కంటిమీద కునుకు కరువైంది. 

అప్రమత్తంగా ఉండాలన్న అటవీశాఖ 
దేవటూడు పరిసరాల్లో సంచరించే పెద్దపులి.. దాహం తీర్చుకునేందుకు నెలకు ఒకటి లేదా రెండుసార్లు బొమ్మలాపురం సమీపంలోని గండి చెరువు వద్దకు వస్తుంటుందని అటవీశాఖ అధికారులు తెలిపారు. పులి తన సహజ ఆవాస పరిధిలోనే తిరుగుతోందని, ప్రజలు అటవీ ప్రాంతాల్లోకి వెళ్లరాదని హెచ్చరించారు. మేతకు వెళ్లిన పశువులను సాయంత్రం కాకముందే గ్రామాలకు తరలించాలని స్పష్టం చేశారు. అటవీ సరిహద్దుల్లో నిరంతర నిఘా ఉంచి పులులు గ్రామాలపైకి రాకుండా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: ప్రియుడిపై మరిగిన నూనె పోసి చంపేసిన రాములమ్మ


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement