మంత్రి రవికుమార్‌ అడౌన్‌..డౌన్‌..! | TDP Leaders Protest Against Gottipati Ravikumar Over Police Denial Of DJ Permission For Vinayaka Immersion | Sakshi
Sakshi News home page

మంత్రి రవికుమార్‌ అడౌన్‌..డౌన్‌..!

Sep 18 2026 12:21 PM | Updated on Sep 18 2026 12:52 PM

TDP Leaders Fire On Gottipati Ravikumar To Police Permission For DJ

ప్రకాశం (అద్దంకి): వినాయక విగ్రహం నిమజ్జనానికి డీజేకి పోలీసులు పర్మిషన్ లేదన్నారు.. పర్మిషన్ ఇచ్చేదాకా కదలం.. మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ డౌన్‌..డౌన్‌.. నారా లోకేష్‌ వస్తాడో.. చంద్రబాబు వస్తాడో.. రవికుమార్‌ వస్తాడో రండి... అంటూ తెలుగు తమ్ముళ్లు నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. సంతమాగులూరు మండలంలోని మక్కెనవారిపాలెం గ్రామంలో గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం.. గ్రామంలో తెలుగు తమ్ముళ్ల ఆధ్వర్యంలో వినాయక విగ్రహం ఏర్పాటు చేశారు. 

నిమజ్జనం చేసే సమయంలో డీజేకి అనుమతివ్వాలంటూ పోలీలసుల వద్దకు వెళ్లారు. డీజేకి అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో.. తమకు అనుమతివ్వాల్సిందేనని, ఎందుకివ్వరని పోలీసులను నిలదీశారు. ఎవరికీ అనుమతివ్వం, ఇది ప్రభుత్వం నుంచి వచ్చిన ఆర్డర్‌ అని పోలీసులు చెప్పడంతో నడిరోడ్డుపై పచ్చకండువాలతో టీడీపీ శ్రేణులు ధర్నాకు దిగారు. స్థానిక ఎమ్మెల్యే అయిన మంత్రి రవికుమార్‌ డౌన్‌..డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. అంతటితో ఊరుకోకుండా నారా లోకేష్‌ వస్తాడో, చంద్రబాబు వస్తాడో, రవికుమార్‌ వస్తాడో రావాలని, అప్పటి వరకూ కదిలేది లేదని నినాదాలు చశారు. 

రెండు వర్గాల్లో ఒక వర్గానికే అనుమతివ్వడంతో వివాదం... 
మక్కెనవారిపాలెం గ్రామంలో టీడీపీకి చెందిన రెండువర్గాల వారు వినాయకుని విగ్రహాలు ఏర్పాటు చేశారు. అందులో ఒక వర్గానికి డ్యాన్స్‌కు, డీజేకి అనుమతిచ్చి రెండో వర్గానికి ఇవ్వలేదు. దీంతో రెండో వర్గం వారు ధర్నాకు దిగారు. సీఐ మాత్రం డ్యాన్స్‌లు మామూలేగానీ.. డీజేలకు ఎవరికీ అనుమతివ్వలేదని చెప్పుకొచ్చారు. 

టీడీపీ శ్రేణుల కోసం దిగొచ్చిన మంత్రి... 
సొంత పార్టీ శ్రేణుల నుంచి డీజే విషయంలో నిరసన సెగ తగలడంతో స్పందించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్‌.. హోంమంత్రితో మాట్లాడి ఎస్పీ ద్వారా నిబంధనలకు లోబడి తక్కువ సౌండ్‌తో డీజే పెట్టుకునే విధంగా అనుమతులివ్వమని చెప్పినట్లు తెలిసింది. ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశమైంది. సొంత పార్టీ వారు కోరిన విధంగా ప్రభుత్వం నడుస్తుందా? వారు ఏది కోరితే అది చేస్తారా? అని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇదేం పరిపాలన అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement