గురువారం శ్రీ 17 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

గురువారం శ్రీ 17 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

Sep 17 2026 2:14 AM | Updated on Sep 17 2026 2:14 AM

గురువారం శ్రీ 17 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026 – 8లో.. పిన్నీసులతో జిప్పులకు ‘చికిత్స’ ..! రైతాంగానికి అండగా ప్రణాళికలు ● కలెక్టర్‌ ఎం.విజయ సునీత నిరుద్యోగుల పొట్టకొట్టిన చంద్రబాబు ● డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు పిచ్చయ్య

న్యూస్‌రీల్‌

ఇచ్చిన నెలకే చిరిగిపోయిన ‘విద్యార్థి మిత్ర’ బ్యాగులు..

జిప్పులు ఊడి.. హ్యాండిల్స్‌, భుజాల పట్టీలు తెగి అవస్థలు

పుస్తకాలు చేత పట్టుకుని బడిబాట పడుతున్న విద్యార్థులు

రూ.కోట్లు వెచ్చించి పంపిణీ చేసిన కిట్ల నాణ్యతపై తల్లిదండ్రుల ఆగ్రహం

సాక్షి విజిట్‌తో వెలుగులోకి..

‘విద్యార్థి మిత్ర’ పేరుతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇచ్చిన బ్యాగుల నాణ్యతలో డొల్లతనం పట్టుమని నెలకాకుండానే బయటపడింది. విద్యా సంవత్సరం ప్రారంభమైన రెండు నెలలకు ఆలస్యంగా ఇచ్చినవీ నాసిరకంగా ఉండటంతో అవి ఎక్కడికక్కడ చిరిగిపోయి, జిప్పులు ఊడి వాడకానికి పనికిరాకుండా పోయాయి. కొందరు విధిలేక కొత్తబ్యాగులు కొనుక్కుని తెచ్చుకుంటుంటే మరికొందరు వాటినే కుట్టుకుని..జిప్పులకు పిన్నీసులు పెట్టుకుని ఎక్కడ తెగిపోతాయోనన్న భయంతో నానా తంటాలు పడుతున్నారు. విద్యార్థుల భుజాలపై ఉండాల్సిన బ్యాగులు నెలకే భారం కావడం.. ప్రభుత్వ పథకాల అమలుపై పర్యవేక్షణ లోపాలను ఎత్తిచూపుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థి మిత్ర కిట్ల నాణ్యతపై ‘సాక్షి విజిట్‌’లో నాసిరకం బ్యాగులతో విద్యార్థులు పడుతున్న అవస్థలు వెలుగులోకి వచ్చాయి.

బ్యాగుల జిప్పులు పనిచేయకపోవడంతో కొందరు విద్యార్థులు వాటిని పిన్నీసులతో బిగించుకుని ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. భుజాల పట్టీలు తెగిపోయిన బ్యాగులను మోయలేక ఇళ్ల నుంచి ఇతర బ్యాగులు తెచ్చుకుంటున్నారు. దీంతో ప్రభుత్వం పంపిణీ చేసిన బ్యాగులు పక్కనపెట్టి బయట మార్కెట్‌లో కొనుగోలు చేసిన బ్యాగులతో పాఠశాలకు వస్తున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది.

మార్కాపురం టౌన్‌: మార్కాపురం జిల్లా సహజ వర్షాభావ భౌగోళిక పరిస్థితులు, ఎల్‌నినో వల్ల ఎదురైన తాత్కాలిక వర్షాభావ పరిస్థితులను అధిగమించి, జిల్లాలోని ప్రతి రైతుకూ, గ్రామీణ కుటుంబానికీ ఆర్థిక భద్రత కల్పించేలా చూడాలని కలెక్టర్‌ ఎం.విజయ సునీత అన్నారు. ఖరీఫ్‌లో నికర సాగు విస్తీర్ణం 76 శాతం తగ్గినా రాబోయే రబీ సీజన్‌కు అవసరమైన రుణ ప్రణాళికలు, ముందస్తు విత్తన, పెట్టుబడి సహాయ చర్యలు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం మార్కాపురం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో లీడ్‌ బ్యాంక్‌ (యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా సంప్రదింపుల కమిటీ జిల్లా స్థాయి సమీక్ష కమిటీ ఉమ్మడి సమావేశానికి కలెక్టర్‌ అధ్యక్షత వహించారు. 2026–27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (జూన్‌ 2026 నాటికి) వార్షిక రుణ ప్రణాళిక సాధించిన పురోగతిపై సమీక్షిస్తూ, జిల్లా రైతాంగాన్ని ఆదుకునేందుకు బ్యాంకింగ్‌ రంగానికి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. రబీ పంటల సాగు కోసం రైతులకు అవసరమైన రుణాలు, సాంకేతిక పరిజ్ఞానం, నాణ్యమైన విత్తనాలు సకాలంలో అందేలా బ్యాంకులు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. పీఎం విశ్వకర్మ యోజన ద్వారా ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను పెంచేందుకు సూక్ష్మ పరిశ్రమలను గరిష్టంగా ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. సమీక్ష సమావేశంలో లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ షాహీర్‌, జిల్లా వ్యవసాయ అధికారి, డీఆర్‌డీఏ, మెప్మా ప్రాజెక్ట్‌ డైరెక్టర్లు, బ్యాంకింగ్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

దర్శి: రాష్టంలో పోలీసు శాఖలో ఎస్సై, పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టులు దాదాపు రాష్ట్రంగా వ్యాప్తంగా 20 వేలు ఖాళీగా ఉంటే కేవలం దాదాపు 1400 పోస్టులు మాత్రమే విడుదల చేసి సీఎం చంద్రబాబు నిరుద్యోగుల పొట్ట కొట్టారని డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు కేవీ పిచ్చయ్య విమర్శించారు. బుధవారం రెవెన్యూ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌ దేవప్రసాద్‌ కు డీవైఎఫ్‌ఐ నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పిచ్చయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకి మొండి చెయ్యి చూపుతోందని, నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదని అన్నారు. రాష్ట్రంలో సుమారు రెండు లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయకుండా అరకొర పోస్టులు విడుదల చేస్తున్నారన్నారు. కాకినాడలో నిరసన తెలియజేసిన డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నాయుకులు నిరుద్యోగులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ మండల అధ్యక్షులు షేక్‌ పీరా సాహెబ్‌.మండల కార్యదర్శి ఆర్‌ జెస్సిపాల్‌, కళ్యాణ్‌ పాల్గొన్నారు.

నాణ్యత డొల్ల..

బ్యాగులు గుల్ల

ఒంగోలు సిటీ:

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం అందించిన ‘శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర’ కిట్లలోని బ్యాగులు నెల రోజులు తిరక్కముందే నాణ్యత కోల్పోతున్నాయి. జిప్పులు ఊడిపోవడం.. చేతితో పట్టుకునే హ్యాండిల్స్‌ తెగిపోవడం.. వీపునకు తగిలించుకునే పట్టీలు పూర్తిగా ఊడిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పుస్తకాలు సర్దుకుని బడికి వెళ్లాలంటే బ్యాగు ఎక్కడ ఊడిపోతుందోనన్న భయంతో కొందరు విద్యార్థులు కొన్ని పుస్తకాలను బ్యాగులో, మరికొన్నింటిని చేతుల్లో పట్టుకుని పాఠశాలకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రకాశం జిల్లాలో మొత్తం 1,980 పాఠశాలలు ఉండగా వాటిలో 1,489 ప్రభుత్వ, 443 ప్రైవేట్‌, 48 ఎయిడెడ్‌ పాఠశాలలు ఉన్నాయి. మార్కాపురం జిల్లాలో మొత్తం 1,620 పాఠశాలలు ఉండగా.. 1,330 ప్రభుత్వ, 230 ప్రైవేట్‌, 60 ఎయిడెడ్‌ పాఠశాలలు ఉన్నాయి. ప్రకాశం, మార్కాపురం జిల్లాల పరిధిలో కలిపి 2,71,764 మంది విద్యార్థులు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రకాశం జిల్లాలో 1,11,936 మంది, మార్కాపురం జిల్లాలో 1,59,828 మంది విద్యార్థులున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులకు సరఫరా చేసిన బ్యాగుల నాణ్యతపై ఫిర్యాదులు వస్తుండటంతో ప్రభుత్వం సరఫరాదారులపై ఏ మేరకు నాణ్యతా పరిశీలన చేపట్టిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

బాధ్యత ఎవరిది..?

విద్యార్థులకు ఉచితంగా ఇచ్చే బ్యాగులు కనీసం విద్యా సంవత్సరం మొత్తం మన్నికగా ఉండేలా నాణ్యతా ప్రమాణాలు నిర్దేశించాల్సి ఉంది. కానీ నెల రోజులకే జిప్పులు, పట్టీలు ఊడిపోతే ప్రజాధనం వెచ్చించి కొనుగోలు చేసిన బ్యాగుల నాణ్యతను ఎవరు ధ్రువీకరించారన్నది కీలకంగా మారింది. తక్షణమే అధికారులు పాఠశాలల వారీగా బ్యాగుల నాణ్యతను పరిశీలించి, దెబ్బతిన్న బ్యాగులను మార్చడంతో పాటు నాసిరకం సరఫరాపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

మార్కాపురం నియోజకవర్గంలో మొత్తం 271 పాఠశాలల్లో 24,549 మంది చదువుకుంటున్నారు. విద్యార్థులకు ఇచ్చిన విద్యా కిట్లలోని బ్యాగులు జిప్పులు ఊడిపోయి, కొసలు చిరిగిపోయాయి. కొంతమంది విద్యార్థులు ఆ చిరిగిపోయిన బ్యాగులోనే పుస్తకాలను తీసుకొని పాఠశాలకు వస్తుండగా, మరికొంత మంది విద్యార్థుల తల్లిదండ్రులు బయట షాపులకు వెవెళ్లి రూ.1000 నుంచి రూ.1200 మధ్య కొత్త బ్యాగులు కొనుగోలు చేసి తమ పిల్లలకు ఇచ్చి పాఠశాలలకు పంపుతున్నారు. నాణ్యమైన బ్యాగులు తమ పిల్లలకు ఇచ్చి ఉంటే మళ్లీ తాము షాపులకు వెళ్లి కొత్త బ్యాగులు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండేది కాదని పలువురు తల్లిదండ్రులు తెలిపారు.

కొండపి నియోజకవర్గంలో టంగుటూరు మండలంలో ప్రభుత్వం అందించిన బ్యాగులు కొంతమంది విద్యార్థుల వద్ద చిరిగిపోయాయి. ఇచ్చిన వారానికే బ్యాగులకు కుట్లు ఊడిపోవడంతో కొంతమంది విద్యార్థులు అలానే పాఠశాలలకు వెళుతున్నారు.

కందుకూరు నియోజకవర్గంలో కొందరు విద్యార్థులకు మాత్రమే విద్యామిత్ర కిట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీంతో తల్లిదండ్రులు వేలకు వేలు ఖర్చు చేసి బయట మార్కెట్‌లో బ్యాగ్‌లు, బూట్లు వంటివి కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. విద్యా మిత్ర కిట్లు కొందరు విద్యార్థులకు మాత్రమే ఇప్పటి వరకు సరఫరా చేశారు. ప్రధానంగా కందుకూరు నియోజకవర్గంలోని కందుకూరు, గుడ్లూరు, లింగసముద్రం మండలాల పాఠశాలకు విద్యామిత్ర కిట్లు అరకొరగా పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోని 3,4,5 తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఇప్పటి వరకు కిట్లు పంపిణీ చేయలేదు. ప్రభుత్వం నుంచే కిట్లు రాలేదని, దీంతో విద్యార్థులకు విద్యామిత్ర కిట్లు ఇవ్వలేదని విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. గుడ్లూరు మండలంలో 3, 4, 5 తరగతులకు సంబంధించి 1100 మంది, కందుకూరు మండలంలో 1163 మంది విద్యార్థులకు సంబంధించి విద్యామిత్ర కిట్లు ఇంత వరకు పంపిణీ చేయలేదు. దీంతో విద్యార్థులు గత ఏడాది ఇచ్చిన బ్యాగులు కొందరు ఉపయోగించుకుంటుండగా, కొందరు బయట మార్కెట్‌లో కొనుగోలు చేసుకున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తున్నారు.

గిద్దలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 353 ప్రభుత్వ పాఠశాలల్లో 25,686 మంది పేద విద్యార్థులు చదువుకుంటున్నారు. బ్యాగ్‌లు పంపిణీ చేసిన నెలరోజులకే పనికిరాకుండా పోవడంతో దాదాపు 45 శాతం మంది విద్యార్థులు తమ సొంత బ్యాగులతో పాఠశాలలకు తీసుకెళ్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ బడుల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

సంతనూతలపాడు నియోజకవర్గంలో విద్యార్థులకు స్కూలు బ్యాగులు ఇచ్చి నెల రోజులు కాకముందే కొన్ని బ్యాగులకు జిప్పులు ఊడిపోయాయి. చేతితో పట్టుకునే హ్యాండ్‌ పీస్‌, వీపునకు తగిలించుకునే కాడలు పూర్తిగా ఊడిపోయాయి. కొంత మంది విద్యార్థులు బ్యాగులను వీపునకు తగిలించుకునే కాడలు లేకపోవడంతో వాటిలో పుస్తకాలు పెట్టుకొని బడికి రావడంలో ఇబ్బందులు పడుతున్నారు. నియోజకవర్గంలో దాదాపు 300కు పైగా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వాటిలో సుమారు 18 వేలకు పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వారికి పాఠశాలలు తెరిచిన మొదట్లోనే పాఠ్యపుస్తకాలు, నోట్‌పుస్తకాలతో పాటు స్కూలు బ్యాగులు ఇవ్వాల్సి ఉంది. ఆలస్యంగా వచ్చినా నాణ్యమైన బ్యాగులు ఇచ్చారా..? అంటే అదీ లేదు. ఆగస్టు మొదటి వారంలో బ్యాగులు పంపిణీ చేశారు. తీరా నెల రోజులు గడవకముందే విద్యార్థుల చేతులలో చినిగిన బ్యాగులను చూసి వారి తల్లిదండ్రులు ఇవేమి బ్యాగులంటూ నిట్టూరుస్తున్నారు. స్వంత డబ్బులను పెట్టి మళ్లీ బ్యాగును కొనివ్వాల్సి వస్తోందని వాపోతున్నారు.

దర్శి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 25,046 మంది విద్యార్థులున్నారు. కూటమి ప్రభుత్వ అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర అనే పేరుతో బ్యాగులు, షూ, యూనిఫాం, బెల్టులు అందించారు. అయితే తాళ్లూరు మండలంలో పలు పాఠశాలలో విద్యార్థుల నాణ్యతలేని బ్యాగులు ఇవ్వటంతో జిప్పులు ఊడిపోయి, నాడాలు చినిగి దర్శనమిస్తున్నాయి. కురిచేడు మండలంలో విద్యార్థులకు ఇచ్చిన బ్యాగులు చిరిగిపోయాయి. దర్శి, దొనకొండ, ముండ్లమూరు విద్యార్థులకు ఇచ్చిన షూ సైజులు సరిపోక చెప్పులు వేసుకుని పాఠశాలకు వస్తున్నారు. పలు పాఠశాలల్లో బ్యాగులు చినిగిపోవడంతో బయట దుకాణాల్లో కొనుగోలు చేసిన బ్యాగులతో పాఠశాలకు వస్తున్నారు. బ్యాగు కొనే స్థోమత లేని విద్యార్థులు చినిగిన బ్యాగులతో పాఠశాలకు వస్తున్నారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సాక్షి బృందం నిర్వహించిన విజిట్‌తో పాఠశాలల్లో విద్యార్థుల బ్యాగుల పరిస్థితిని పరిశీలించగా సమస్య తీవ్రత స్పష్టంగా కనిపించింది. పలువురు విద్యార్థుల బ్యాగులు ఇప్పటికే చిరిగిపోవడం, జిప్పులు ఊడిపోవడం, హ్యాండిల్స్‌, భుజాల పట్టీలు తెగిపోవడం కనిపించింది. కిట్లు పంపిణీ చేసి నెల రోజులు కూడా పూర్తికాకముందే ఈ పరిస్థితి రావడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అందించిన బ్యాగులు ఉపయోగపడకపోవడంతో పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు రూ.1000 నుంచి రూ.1200 లతో కొనిచ్చిన బ్యాగులతో పాఠశాలలకు వస్తున్నారు. ఉచితంగా అందించిన బ్యాగులను వినియోగించుకోలేని పరిస్థితి నెలకొనడంపై తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చడంపై రాజకీయ విమర్శలు పక్కనపెడితే.. విద్యార్థులకు అందించే వస్తువుల నాణ్యత విషయంలో రాజీ ఉండకూడదని తల్లిదండ్రులు అంటున్నారు. గత ప్రభుత్వంలో విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే విద్యార్థులకు కిట్లు అందేవని, ఇప్పుడు విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత కూడా విడతలు విడతలుగా ఆగస్టు నెలాఖరు వరకు కిట్లు పంపిణీ చేసినట్లు చెబుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న విద్యార్థి మిత్ర కిట్లలోని బ్యాగులే కొద్ది రోజుల్లో పనికిరాకపోతే పథకం ఉద్దేశమే దెబ్బతింటుందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement