జేసీబీ తవ్వకాలతో ఏర్పడిన భారీ క్వారీ
సాక్షి టాస్క్‌ఫోర్స్:
అధికార పార్టీ అండదండలతో ఇసుక మాఫియా పేట్రేగిపోతోంది. పేద దళితుల పొట్టకొట్టి, కోట్ల రూపాయల విలువైన మన్నేటి ఇసుక సంపదను యథేచ్ఛగా దోచుకుంటోంది. జిల్లా కలెక్టర్ ఇచ్చిన నిషేధాజ్ఞలను సైతం అధికార మదంతో గాలికొదిలేసింది. ‘తవ్వకాలను అడ్డుకుంటే అంతు చూస్తాం.. ఇప్పటికే చాలా ఖర్చు చేశాం.. ఏం కావాలో ముందే తేల్చుకోండి’ అంటూ బాధితులను బెదిరింపులకు గురిచేస్తోంది. అధికారులు, పచ్చ నేతల ఆశీస్సులతో దర్జాగా సాగుతున్న ఈ ఇసుక దోపిడీపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పేదల భూములపై కన్నేసిన మాఫియా
కందుకూరు మండలం శ్రీరంగరాజపురం సమీపంలోని మన్నేరు తీరంలో ఉలవపాడు మండలం బద్దిపూడి గ్రామానికి చెందిన దళితులకు గతంలో సర్వే నంబర్–1లో 54.31 ఎకరాల భూమికి ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసింది. ఈ భూములపై కన్నేసిన ఒంగోలుకు చెందిన టీడీపీ అనుకూల ఇసుక వ్యాపారులు గత నాలుగైదు నెలలుగా భారీ తవ్వకాలకు తెరలేపారు. బాధితులు కలెక్టర్ నుంచి కిందిస్థాయి అధికారుల వరకు తిరిగి మొరపెట్టుకోవడంతో, రెండు నెలల క్రితం కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు తవ్వకాలను నిలిపివేశారు. అయితే, కొద్దిరోజులకే మళ్లీ పచ్చ నేతలు రంగప్రవేశం చేసి దళిత రైతులను బెదిరించి, బద్దిపూడికి చెందిన అధికార పార్టీ నాయకుల సహకారంతో తిరిగి తవ్వకాలు ముమ్మరం చేశారు. భయాందోళనకు గురైన ఎస్సీలు తమ సొంత భూముల్లోకి వెళ్లేందుకు కూడా జంకుతున్నారు.
సరిహద్దులు దాటుతున్న సంపద
ఎలాంటి అనుమతులూ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా భారీ జేసీబీలతో పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుకను తోడేస్తున్నారు. తవ్విన ఇసుకను సమీపంలోని మదనగోపాలపురం వద్ద గుట్టలుగా డంప్ చేసి, అక్కడి నుంచి భారీ టిప్పర్ల ద్వారా ఇతర జిల్లాలు, పొరుగు రాష్ట్రాలకు తరలిస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. భారీ లోడుతో తిరుగుతున్న టిప్పర్ల ధాటికి గ్రామీణ రహదారులు ఛిద్రమై గుంతలమయంగా మారుతున్నాయి.
అడుగంటుతున్న జలాలు..
ఓవైపు వర్షాభావ పరిస్థితులతో రైతాంగం అల్లాడుతుంటే, మరోవైపు మన్నేటి గర్భాన్ని జేసీబీలతో చీల్చి ఇసుకను తోడేస్తుండటంతో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయే ప్రమాదం ఏర్పడింది. రానున్న రోజుల్లో సమీప గ్రామాల్లో గుక్కెడు తాగునీరు కూడా దొరకని దుస్థితి దాపురిస్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కళ్లెదుటే ఇంత భారీ దోపిడీ జరుగుతున్నా సంబంధిత శాఖల అధికారులు మాత్రం టీడీపీ నేతల ఒత్తిళ్లు, మామూళ్ల మత్తులో జోగుతూ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఎస్సీల భూముల్లో అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


